నడిరోడ్డులో పట్టపగలే యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. 

నర్సాపూర్: యువకులిద్దరి మద్య చెలరేగిన గొడవ పెరిగిపెద్దదై ఒకరినొకరు చంపుకునే స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే కోపంతో రగిలిపోయిన యువకుడు విచక్షణను కోల్పోయి కత్తితో దాడిచేసాడు. ఈ ఘటన మెదక్ జిల్లా (medak district)లో చోటుచేసుకుంది. 

సంగారెడ్డి (sangareddy) జిల్లా జిన్నారం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసే గౌస్ కొడుకు సాయబ్ అలీ(22)కి షేక్ మోయిన్(32) అనే మరో యువకుడికి మద్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ(బుధవారం) మోయిన్ పై సాయబ్ కత్తితో దాడిచేసాడు.

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని పోస్టాఫిస్ వద్ద సాయబ్, మోయిన్ లు ఎదురుపడగా ఇద్దరిమద్యా మాటా మాటా పెరిగి రోడ్డుపైనే గొడవకు దిగారు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే సాయబ్ తనవెంట తెచ్చుకున్న కత్తిని తీసి మోయిన్ పై దాడిచేసాడు. 

ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సరికి మోయిన్ కత్తిపోట్లకు పడిపోయి వున్నాడు. అతడిని స్థానిక హాస్పిటల్ కు తరలించగా పరిస్థితి విషమంగా వుండటంతో సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

ఈ హత్యాయత్నంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారమే ఇద్దరి మద్యా గొడవకు దారితీసి చివరికి చంపుకునే స్థాయికి చేరితీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు సాయబ్ పరారీలో వుండగా అతడి కోసం గాలిస్తున్నారు.

ఇదిలావుంటే నిర్మల్ జిల్లాలోనూ ఇలాగే గత నెలలో ఇద్దరు యువకుల మద్య ప్రేమ వ్యవహారంలో తలెత్తిన గొడవలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శి నగర్ లో ప్రసాద్ కు మరో యువకుడితో ప్రేమ విషయంలో గొడవ జరిగింది. మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుందామని కలుసుకున్న ఇద్దరు యువకుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన యువకుడు ప్రసాద్ పై కత్తితో దాడి చేసాడు. విచక్షణారహితంగా కత్తితో ప్రసాద్ శరీరంలో ఎక్కడపడితే అక్కడ పొడవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు ప్రసాద్ లోకేశ్వరం మండలం గడ్‌చందాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.