Telangana Politics: చిన్నరాజకీయ పార్టీలు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సవాలు విసురుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలకు తీసిపోని రీతిలో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఫలితాలను మర్చే స్థాయిలో ప్రచారం.. పాదయాత్రలను బరిలో నిలిచిన చిన్న పార్టీల నేతలు, స్వతంత్య్ర అభ్యర్థులు కొనసాగిస్తున్నారు.
Munugodu by-election: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఇదివరకు చూడని పరిస్థితులను మునుగోడు ఉప ఎన్నిక క్రమంలో చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆయా పార్టీల మధ్య పోటీ.. మరో అంశం నాయకులు పార్టీల మార్పులతో మారుతున్న రాజకీయాలు. ఇప్పటివరకు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పోటీ రాష్ట్రంలోని మూడు ప్రధానమైన పార్టీల మధ్యే ఉంటుందని రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, ఇదే సమయంలో ప్రధాన పార్టీలకు సవాలు విసురుతూ.. చిన్న పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. ఎన్నిక ఫలితాలపై ప్రభావం చూపేలా ముందుకు సాగుతున్న ఈ పరిణామాలు ప్రధాన పార్టీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుజ్జగింపు చర్యలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి.
ఇంతకుమందు కంటే భిన్నంగా మునుగోడు పరిస్థితులు..
రాష్ట్రలో ఇదివరకు హూజూర్‌నగర్, దుబ్బాక ,నాగార్జునసాగర్, హుజూరాబాద్ లలో జరిగిన ఉప ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే..
హూజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యనే ఉన్నది. దుబ్బాక ఉప ఎన్నిక త్రిముఖ పోటీ అంచనాలు ఉన్న ఫలితం ఎలా ఉండిందో అందరికీ తెలిసిందే. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీ మధ్య ఉంటుందని భావించినా.. చివరికి అది రెండు పార్టీల పోటీగానే ముగిసింది. ఇదే క్రమంలో ప్రస్తుతం ఎన్నిక జరగబోయే మునుగోడు ఉప ఎన్నిక కూడా ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని ఇదివరకు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, ప్రస్తుతం జరుగుతున్న క్షేత్రస్థాయి పరిణామాలు గమనిస్తే.. ఇందుకు భిన్న పరిస్థితులు ఉన్నాయి. పెద్ద పార్టీలకు తీసిపోని రీతిలో చిన్నా పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.
ఆసక్తికర విషయాలు.. ఆందోళనలో ప్రధాన పార్టీలు !
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు బీఎస్సీ, టీజేఎస్ సహా పలు చిన్నా పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు బరిలోకి దిగారు. పెద్ద పార్టీలతో పాటు చిన్న పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు. చిన్న పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థుల ప్రచారం, పాదయాత్రల నేపథ్యంలో ప్రజల నుంచి మంచి స్పందనను పొందుతున్నారు. ఇదే విషయం ఇప్పుడు ప్రధాన పార్టీలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఎందుకంటే ఎన్నికల్లో చిన్న పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రధాన పార్టీల ఫలితాలను తారుమారు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఓట్ల చీలికతో పెద్ద పార్టీల గెలుపును శాసించే అవకాశముందని తాజాగా నెలకొన్న పరిస్థితులు రుజువు చేస్తున్నాయి.
చిన్న పార్టీలు, స్వతంత్రులకు మంచి గుర్తింపు..
చిన్న పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులకు స్థానికంగా మంచి గుర్తింపు ఉండటం ఓట్ల చీలిక అధికంగానే ఉంటుందని తెలుస్తోంది. అందులో ఒకటి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్. ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో బీఎస్పీ మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచింది. ఇప్పటికే రాష్ట్ర బీఎస్సీ నాయకుడి రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించిన ఆయనకు ప్రజల నుంచి స్పందన బాగానే ఉంది. దీనికి తోడు బీసీ ఓటర్ల అధికంగా ఈ నియోజకవర్గంలో ఉండటం, అలాగే, బీసీ నాయకుడు ఆందోజు శంకరాచారిని బరిలో నిలపడం బీఎస్సీ ఓటు బ్యాంకును పెంచే అవకాశముంది. ఇదే ధీమాతో బీఎస్పీ ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి (టీజేఎస్) కూడా మునుగోడు బరిలో నిలిచింది. ఈ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని రంగంలో దింపింది. బోడంగిపర్తికి చెందిన పల్లె వినయ్‌కుమార్ టీజేఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కుటుంబం కూడా పొలిటికల్ గా స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. అలాగే, బీసీలకు మద్దతుగా టీజేఎస్ ప్రచారం ఓటర్ల నుంచి మంచి స్పందనను రాబట్టే అవకాశముంది. స్థానికంగా మంచి గుర్తింపు ఉన్న చాలా మంది స్వతంత్య్ర అభ్యర్థులు కూడా రంగలోకి దిగడంతో ఓట్ల చీలిక అధికంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
70 శాతం వెనుకబడిన తరగతుల ఓట్లే..
మునుగోడులో సామాజిక తరగతులు కూడా కీలకంగా మారాయి. మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 2.7 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇందులో 70 శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందినవారే కావడం గమనార్హం. ఇంతకుముందు జరిగిన 2018 ఎన్నికలను గమనిస్తే.. మునుగోడులో 2018లో ఏకంగా 91.30 ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మునుగోడులో 49 శాతం ఓట్లతో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 37 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలవగా, బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి కేవలం 6.40 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, ఈ ఎన్నికల్లో చిన్న పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులకు 6 శాతం ఓట్లను సాధించారు. ఈ సారి మాత్రం ఇది ఎక్కువగానే ఉంటుందని క్షేత్ర స్థాయి రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కాంగ్రెస్ కంచుకోట.. కానీ..
మునుగోడులో గత ఎన్నికల్లో తిరుగులేని విధంగా 49 శాతం ఓట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాజగోపాల్ ప్రస్తుతం బీజేపీ నుంచి బరిలోకి దిగారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ లేదు.. కానీ రాజగోపాల్ అనుచరులు ఉండటం, కాంగ్రెస్ నేత, ఆయన సోదరుడు పరోక్షంగా మద్దతు ఇస్తుండటం, బీజేపీకి గత కొంత కాలంగా రాష్ట్రంలో ఆదరణ పెరుగుతుండటం గెలుపునకు అనుకూల అవకాశాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల విజయావకాశాలు అధికంగా ఉన్నాయని అంచానాలు ఉన్నాయి. చూడాలి మరి మునుగోడు ఆసక్తికర పోరులో ఎవరిని ఓటర్లు ఆదరిస్తారో.. !
