మునుగోడు బైపోల్ 2022 : టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు కోరిన కేసీఆర్.. నేడు అధికారికంగా ప్రకటన..
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ సీపీఐ నేతలను అడిగారు. ఈ మేరకు సీపీఐ నేతలతో చర్చలు జరిపారు. దీనిమీద ఈ రోజు సీపీఐ అధికారికంగా ప్రకటన చేయనుంది.
హైదరాబాద్ : ఉపఎన్నిక దగ్గర పడుతున్నకొద్దీ మునుగోడులో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ తమదైన శైలిలో పావులు కదుపుతున్నాయి. ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని గట్టిపట్టుతో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీపీఐ నేతలు చర్చలు జరిపారు. నిన్న రాత్రి రెండు గంటల పాటు సిపిఐ నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఉపఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా.. టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని సిపిఐ నేతలు హామీ ఇచ్చారు.
సీఎంతో చర్చించిన అంశాలపై కార్యదర్శివర్గ సిపిఐ నేతలు శనివారం ఉదయం పదిన్నర గంటలకు సమీక్షించి... మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు మునుగోడు సభకు రావాలని సిపిఐ నేతలను సీఎం కోరగా సభలో పాల్గొనేందుకు సీపీఐ అంగీకరించింది. టిఆర్ఎస్ మునుగోడు సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి పాల్గొననున్నారు.
నేడు మునుగోడులో రేవంత్ పాదయాత్ర.. పాధాబివందనంతో వినూత్న రీతిలో ప్రచారానికి సిద్దమైన కాంగ్రెస్
కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారానికి సీఎం కేసీఆర్ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. మునుగోడ లో జరగనున్న బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభకు మునుగోడు ప్రజాదీవెన సభగా పేరుపెట్టారు. సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మర్రిగూడ మండలం చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల ముంపు గ్రామాల బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కొద్ది రోజులుగా వీరు దీక్షలు చేస్తున్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే పోలీసులు చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల భూనిర్వాసితులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం కెసిఆర్ సభలో నిరసన తెలియచేస్తారని అనుమానంతోనే ముందస్తుగా అరెస్టు చేశారు. ఇక పోలీసులు దాదాపు 80 మందిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికను సెమీఫైనల్గా భావిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మునుగోడుపై దృష్టి సారించారు. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు.
ఇక నేడు సీఎం కేసీఆర్ భారీ ర్యాలీగా హైదరాబాద్ నుంచి మునుగోడు కు చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆయన సభావేదిక వద్దకు చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఈ సభకు జనసమీకరణపై జిల్లా టిఆర్ఎస్ నాయకులు దృష్టిసారించారు.
కాగా, మునుగోడులో ఓ వైపు నేడు కెసిఆర్ సభ జరగనుండగా, రేపు బిజెపి బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. మరోవైపు మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ కూడా తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. మన మునుగోడు.. మన కాంగ్రెస్ పేరుతో ముందుకు వెడుతుంది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నేడు నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. ఒకే రోజు ఐదు మండలాల్లో పాదయాత్రకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు.