తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని నేతలతో పార్టీ మార్పుపై సమాలోచనల జరపనున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాజగోపాల్ రెడ్డి కలవడంతో.. ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే తాను అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. పార్టీ మరే అంశంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ను ఓడించే సమయంలో బీజేపీకి ఉందని ప్రజలు భావిస్తున్నారని కామెంట్ చేశారు. సమయం వచ్చినప్పుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని అన్నారు. అదే సమయంలో తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానని ప్రకటించారు.
ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని నేతలతో పార్టీ మార్పుపై సమాలోచనల జరపాలని నిర్ణయించారు. నేటి నుంచి మండలాల వారీగా కాంగ్రెస్ నేతలు, తన అభిమానులతో హైదరాబాద్‌లో విడివిడిగా సమావేశం కానున్నారు. మర్రిగూడెం, చండూరు మండలాలకు చెందిన ముఖ్యనేతలను ఆయన హైదరాబాద్‌కు పిలిచారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మర్రిగూడెంకు చెందిన ముఖ్య నేతలు, తన అనుచరులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు చండూరు మండల నేతలతో భేటీ అవనున్నారు. ఈ భేటీల్లో ఆయన పార్టీ మార్పు గురించి చర్చించి.. వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే సరిపోతుందా?.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయలా?.. వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. చాలా కాలంగా రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌పై అసంతృప్తి ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయన కనిపించడం లేదు. అదే సమయంలో ఆయన బీజేపీకి అనుకూలంగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇటీవల అమిత్ షాను రాజగోపాల్ రెడ్డి కలవడంతో.. ఈ వ్యవహరం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి.. పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు.
ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్‌పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించడాన్ని ప్రస్తావిస్తూ.. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని కామెంట్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై కొందరు టీ కాంగ్రెస్ నేతలు.. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
మరోవైపు సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క సోమవారం రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే ఆ చర్చల తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి మాటల్లో ఏమాత్రం మార్పులేదని సమాచారం. మరోవైపు పలువురు బీజేపీ నేతలు కూడా రాజగోపాల్ రెడ్డి తమ పార్టీలోకి వస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
