Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ తో మంత్రి జగదీష్ రెడ్డి భేటీ: మునుగోడుపై చర్చ, అభ్యర్ధిని ప్రకటించే చాన్స్


మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ తో  మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. 

Munugode bypoll 2022:Telangana minister jagadish Reddy meets CM KCR in Pragathi Bhavan
Author
First Published Sep 20, 2022, 3:11 PM IST

హైదరాబాద్: ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం నాడు భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.ఈ సమావేశం తర్వాత మునుగోడులో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్ధిత్వం వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారనే ప్రచారం లేకపోలేదు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని ఆయన వ్యతిరేక వర్గం కోరుతుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని గతంలో అసమ్మతివాదులు డిమాండ్ చేశారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన వారందరిని  మంత్రి జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్ వద్దకు తీసుకు వచ్చారు. అభ్యర్ధి ఎవరైనా  గెలుపు కోసం ప్రయత్నిస్తామని అసమ్మతి నేతలు చెప్పారు. అయితే  సీఎం కేసీఆర్ తో సమావేశం ముగిసిన వారం రోజుల్లోపుగానే  అసమ్మతివాదులు సమావేశం నిర్వహించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేశారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తమకు ఇవ్వడం లేదని గత మాసంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. తనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు కూడా సమాచారం ఇవ్వడం లేదన్నారు. అయితే ఈ విషయమై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాటల్లో తప్పు లేదన్నారు.పార్టీ కార్యక్రమాల గురించి ఎందకు సమాచారం రావడం లేదో సమీక్షించుకొంటామని కూడా మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పరిస్థితిని గమనించిన పార్టీ నాయకత్వం అసంతృప్తివాదులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.  మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దివంగత మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. టీఆర్ఎస్ మాత్రం ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. మునుగోడులో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలకు పార్టీ నాయకత్వం బాధ్యతలను అప్పగించింది. హుజూరాబాద్, దుబ్బాకలో వచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకొని  ఆ తరహ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

గత నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.. గత నెల 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. గత నెల 21న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. 

also read:మునుగోడు నిరుద్యోగ యువతకు కేఏ పాల్ బంఫర్ ఆఫర్.. వారికి ఉచితంగా పాస్‌పోర్టు, అమెరికా వీసా..

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఆరు మాసాల్లోపుగా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో విజయం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు కేంద్రీకరించి పని చేస్తున్నాయి.  మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ, సీపీఎంలు మద్దతు ప్రకటించాయి.ఈ అసెంబ్లీ స్థానంలో  లెఫ్ట్ పార్టీలకు మంచి ఓటు బ్యాంకు ఉంది. బీజేపీని ఓడించాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios