మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మురం చేశాయి. అయితే నియోజకవర్గంలోని చండూరులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమివ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మురం చేశాయి. అయితే నియోజకవర్గంలోని చండూరులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమివ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కేటాయించినట్లు పోస్టరల్లో రాసి ఉంది. అలాగే ట్రాన్సక్షన్ ఐడీ.. BJP18THOUSANDCRORES అని, కొత్త రివార్డ్.. రూ. 500 కోట్ల బోనస్ అని పోస్టర్లలో పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. భారీ ర్యాలీతో వెళ్లిన రాజగోపాల్ రెడ్డి.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఇలాంటి పోస్టర్లు వెలువడం కలకలం రేపుతోంది. ఇక, గతంలో నియోజకవర్గంలోని నారాయణపురంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిసిన సంగతి తెలిసిందే. ‘‘రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే.. అమిత్ షాను బేరామడిని నీచుడివి అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. మునుగోడు నిన్ను క్షమించేది లేదు’’ అని పోస్టర్స్‌లో రాసి ఉంది.
ఇదిలా ఉంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన కుటుంబ ఆధీనంలో ఉన్న కంపెనీకి రూ. 18,000 కోట్ల విలువైన కాంట్రాక్టు ఇవ్వడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాషాయ పార్టీలో చేరారని టీఆర్ఎస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌గోపాల్‌రెడ్డి ఈ విషయాన్ని అంగీకరించారని, ఆయన గత మూడేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ బీజేపీకి పనిచేశారన్నది ఆయన ప్రకటనలోని ప్రధానాంశమని పేర్కొంది. ఈ క్రమంలోనే ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ నివాసానికి ఆదివారం టీఆర్‌ఎస్ నేతలు వెళ్లి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలు క్రిమినల్ క్విడ్ ప్రోకోతో కూడిన తీవ్రమైన చట్టవిరుద్ధమైన నేరాన్ని అంగీకరించడమేనని టీఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొంది.
ఇక, మునుగోడు ఉప ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 14న నామినేషన్ల దాఖలు చేయడానికి గడువు ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17వరకు అవకాశం కల్పించారు. నవంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
