నల్లగొండ: సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో విచారణ ఎదుర్కుంటున్న ఎంఏ కరీం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగుడాలో కులాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడి హత్య అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

ఆ హత్య కేసులో కరీం ఐదో నిందితుడు. ఆతను కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు శుక్రవారంనాడు నామినేషన్ దాఖలు చేశాడు. గతంలో అతను కాంగ్రెసు పార్టీలో ఉన్నాడు. పార్టీ బీ ఫారం ఇవ్వకపోయినా మిర్యాలగుడాలోని 20, 21 వార్డుల నుంచి అతను కౌన్సిలర్ గా బరిలో నిలిచాడు. 

తన కూతురిని వివాహం చేసుకున్న ప్రణయ్ ను హత్య చేయించేందుకు అమృత వర్షిణి తండ్రి మారుతీ రావు స్కెచ్ వేశాడు. ఈ స్కెచ్ లో భాగంగా ముఠాకు మారుతీరావు సుపారీ ఇచ్చాడు. ప్రణయ్ ను హత్య చేసేందుకు జరిగిన కుట్రలో కరీం పాలు పంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

పక్కా ప్రణాళికతో ప్రణయ్ ను హంతక ముఠా చంపేసింది. దళిత యువకుడైన ప్రణయ్ అగ్రవర్ణానికి చెందిన అమృత వర్షిణిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అది మింగుడు పడని అమృత వర్షిణి తండ్రి మారుతీ రావు ప్రణయ్ ను హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావు, తదితరులు బెయిల్ నుంచి విడుదలయ్యారు.