హైదరాబాద్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించకపోతే పదవులు పోతాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రులను హెచ్చరించారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన శనివారం ప్రసంగించారు. 

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ కు బిజెపి పోటీ అనే అపోహ వద్దని, తమకు ఏ పార్టీతోనూ పోటీ లేదని ఆయన చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాబూ మోహన్ కు అవకాశం ఇస్తే నిలుపుకోలేదని ఆయన అన్నారు. 

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయమని కేసీఆర్ చెప్పారు. పాత, కొత్త నేతలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. అవసరమైన చోట మంత్రులు ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు  ఒక్క మున్సిపాలిటీ పోయినా కూడా మంత్రి పదవులు పోతాయని ఆయన అన్నారు. అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత వెన్నుపోట్లు పొడిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

టికెట్ల పంపిణీ, రెబెల్స్ బుజ్జగింపుల బాధ్యత ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ అన్నారు. తాము 120 మున్సిపాలిటీలు, 10 కార్పోరేషన్లు గెలుస్తున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలతో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 

ఇదిలావుంటే, మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య జరిగిన గొడవపై కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. సమావేశం నుంచే కేసీఆర్ సుధీర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్లు చెబుతున్నారు. శుక్రవారం మేడ్చెల్ ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనపై సుధీర్ రెడ్డి వివరణ ఇచ్చారని సమాచారం.