హైదరాబాద్: తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై ములుగు ఎమ్మెల్యే సీతక్క అవాక్కయ్యారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానా ఎవరు చెప్పారంటూ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని అందులో సీతక్క ఒకరంటూ ప్రచారం జరుగుతుంది. 

అయితే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను సీతక్క ఖండించారు. తమను ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు తీర్పునిచ్చారని అలాగే పనిచేస్తామన్నారు. అంతేకానీ తాను పార్టీ మారిపోతున్నారంటూ ప్రచారం చెయ్యడం బాధాకరమన్నారు. 

కొందరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారనే వార్తలు తనకు తెలియదని స్పష్టం చేశారు. ప్రజాకూటమి ఓటమికి కారణాలను పార్టీ విశ్లేషిస్తోందని సీతక్క తెలిపారు. ములుగు జిల్లా, ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయ్యడమే తన లక్ష్యమని అందుకు తాను పోరాటం చేస్తానని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ములుగు జిల్లాను తక్షణమే ఏర్పాటు చెయ్యాలని సీతక్క డిమాండ్ చేశారు.