మెదక్: తన భూమి పాస్ బుక్ కోసం వెళితే మండల రెవెన్యూ అధికారి(ఎమ్మార్వో) తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.  జిల్లాలోని హవేళీ ఘణపూర్ మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలోనే బాధిత మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడ వున్నవారు అడ్డుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా రైతుకు 12ఎకరాల వ్యవసాయ భూమి వుంది. ఈ భూమికి సంబంధించిన వివరాలు రెవెన్యూ రికార్డులో నమోదు కాకపోవడంతో ఇటీవల ప్రభుత్వం అందించిన పాస్ బుక్ లు రాలేవు. దీంతో ఆ పని చేసిపెట్టాలని స్థానిక ఎమ్మార్వోను కోరగా లంచం డిమాండ్ చేశాడని... తన వద్ద అంత డబ్బు లేదని చెబితే లైంగింకంగా వేధించాడని సదరు మహిళ ఆరోపించింది. తనకు న్యాయం జరిగేలా లేకపోవడంతో ఇలా ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని సముదాయించి పోలీసస్టేషన్‌కు తరలించారు. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేయవద్దని... న్యాయం జరిగేలా చూస్తామని స్థానిక పోలీసులు ఆమెకు నచ్చజెప్పారు.