ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు.  పెద్దలసభ రద్దు అనేది సహేతుకమైన చర్యకాదని ఆయన చెప్పారు. బిల్లు ఆమోదం పొందలేదని మండలినే రద్దు చేయడం సరికాదని సూచించారు. 

ఎన్ని రాజధానులు పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ పరిణామాలు చూస్తే నవ్వాలో, ఏడువాలో అర్థంకావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ స్నేహం వల్లే జగన్‌కు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. పక్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు నెలకొంటే తమకు ఇబ్బంది ఉండకూడదనే జగన్ కి కేసీఆర్ ఈ తరహా సలహాలు ఇచ్చినట్లు తనకు అనిపిస్తోందన్నారు.  కేసీఆర్ తో స్నేహం చేస్తే.. జగన్ తో పాటు ఏపీ భవిష్యత్తు కూడా అంధకారమేనని హెచ్చరించారు.

Also Read అభ్యర్థిని ఎత్తుకుపోయారు: ఈసీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు, కేసీఆర్ ఫై ఫైర్.

కేసీఆర్‌తో స్నేహం జగన్‌కు అంత మంచిదికాదని పేర్కొన్నారు. కౌగిలించుకున్న వారందరికీ కేసీఆర్‌ వెన్నుపోటు పొడిచారని చెప్పారు. నేతలకు పట్టుదల ఉండాలి కానీ మొండితనం ఉండకూడదని రేవంత్‌ రెడ్డి సూచించారు. కేసీఆర్ ని నమ్మినవాళ్లు బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు.

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, 2009లో చంద్రబాబుకి కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ని పక్కాగా నమ్మించి కాగ్రెస్ కి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. 2019లో జగన్ తో జత కలిశారన్నారు.