తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటన, ఆలయ అభివృద్దికి సంబంధించి సమీక్ష నేపథ్యంలో.. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్టు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ఈరోజు దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికే కొండగట్టు ఆలయ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆలయ అభివృద్ది పనులకు సంబంధించి జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పుల చర్చిస్తారు.
కేసీఆర్ కొండగట్టు పర్యటన, ఆలయ అభివృద్దికి సంబంధించి సమీక్ష నేపథ్యంలో.. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్టు చేశారు. కొండగట్టు ఆలయ రూపాన్ని మెరుగుపరిచేవిధంగా.. మరొక మైలురాయి పౌరాణిక నిర్మాణాన్ని అభివృద్ధి జరగబోతుందని అన్నారు. గతంలో కేసీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి అనేకసార్లు కొండగట్టు ఆలయాన్ని దర్శనం చేసుకున్నారని చెప్పారు. అందుకు సంబంధించి ఫొటోలను కూడా షేర్ చేశారు. ఆ ఫొటోల్లో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపటం కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టు సమీపంలోని నాచుపల్లిలోని జేఎన్‌టీయూకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో కేసీఆర్ కొండగట్టు ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు ఆలయ పరిసరాలను పరిశీలించారు. తర్వాత ఆలయ అభివృద్దికి సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
