తన హాజరు శాతం తప్పుగా ప్రచురించారని మండిపాటు
ఎప్పుడూ కూల్ గా ఉండే టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఈ రోజు పార్లమెంట్ లో కాస్త ఫైర్ అయ్యారు. ఆయన కోపానికి మంచి రీజనే ఉందిలెండి.
ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రిక పార్లమెంట్ లో ఎంపీల హాజరుశాతంపై కథనం రాసింది.
అయితే ఇందులో అతి తక్కువ హాజరుశాతం ఉన్న ఎంపీలలో తెలంగాణ ఎంపీ జితేందర్ రెడ్డి పేరు కూడా ఉంది.
ఆయన హాజరు శాతం కేవలం 9 మాత్రమేనని తన కథనంలో పేర్కొంది. అయితే జితేందర్ రెడ్డి హాజరు శాతం పార్లమెంట్ లో 90 శాతం కంటే ఎక్కువే ఉంది.
పైగా ఆయన పార్లమెంట్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లోర్ లీడర్ కూడా. తెలంగాణకు సంబంధించిన విభజన సమస్యలు, హైకోర్టు ఏర్పాటుపై ఆయన గత మూడేళ్లుగా బాగానే పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు. వివిధ చర్చల్లో పార్టీ తరఫున తన వాణిని వినిపిస్తున్నారు.
కానీ, ఆంగ్ల దినపత్రిక మాత్రం 90 శాతం ఉన్న ఆయన హాజరు శాతాన్ని 9 శాతానికి తీసుకొచ్చింది.
అందువల్లే జితేందర్ రెడ్డి ఆ పేపర్ పై బాగా ఫైర్ అయిపోతున్నారు. ఈ రోజు పార్లమెంట్ లో ఆ పేపర్ పై చర్యతీసుకోవాలని స్పీకర్ ను డిమాండ్ చేశారు.
గౌరవ సభ్యులపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా కథనాలు రాయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.
