తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో జోరందుకుంది. కేవలం మరో రెండు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా తన తరపున ప్రచారం నిర్వహించేందుకు ప్రముఖ సినీనటున్ని దించారు. తెలుగు సినిమా యాక్టర్, దర్శకుడు రవిబాబు కోమటిరెడ్డికి మద్దతుగా నల్గొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రవిబాబు నల్గొండ ప్రజలతో మాట్లాడుతూ...కేవలం నల్గొండలోనే కాదు యావత్ తెలంగాణలో అత్యంత మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డేనని ప్రశంసించారు. అలాంటి వ్యక్తిని నియోజకవర్గ ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని రవిబాబు కోరారు. ఆయన గెలిస్తే మంచి పనులు చేస్తారనే నమ్మకంతో ప్రచారంలో పాల్గొన్నానని రవిబాబు తెలిపారు. 

ఇక ఈ సందర్భంగా కొమటిరెడ్డి మాట్లాడుతూ...నల్గొండలో పోటీ చేద్దామని అనుకున్నానని కేసీఆర్ నల్గొండ ప్రజా ఆశిర్వాద సభలో మాట్లాడిన మాటలను గుర్తుచేశారు. తనపై పోటీ చేసి గెలవలేనని తెలిసే కేసీఆర్ పోటీ నుంచి తప్పుకుని వుంటారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎన్నికలు అభ్యర్థులు, పార్టీల మధ్య కాదని...ప్రజల ఆత్మగౌరవం...కేసీఆర్ దోపిడి సొమ్ము మధ్య జరుగుతోందన్నారు. నల్గొండ ప్రజల ఆత్మగౌరవం మరోసారి గెలవనుందని...ఆ విషయం డిసెంబర్ 11న బైటపడుతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.