నల్గొండ: అచ్చం సినిమాలో జరిగినట్టుగానే జరిగింది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు పెళ్లిళ్లు జరిగాయి. పెద్దలు నిర్ణయించిన వ్యక్తితో తాళి కట్టించుకొన్న యువతి మరునాడే తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొంది. ఈ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటు చేసుకొంది. 

జిల్లాలోని కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన మౌనిక కుటుంబం పదేళ్లుగా కురంపల్లిలో నివాసం ఉంటుంది. మౌనికకు దేవరకొండకు చెందిన యువకుడితో ఈ నెల 12వ తేదీన పెళ్లి జరిపించారు.

మౌనికకు వరుసకు మామ అయిన రాజేష్ ను ప్రేమిస్తోంది.ఈ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పలేదు. పెద్దలు నిర్ణయించిన దేవరకొండకు చెందిన యువకుడితో తాళి కట్టించుకొంది. పెళ్లి జరిగిన తర్వాత అత్తింటివారికి కూతురును అప్పగించే సమయంలో  ప్రేమించిన యువకుడు  రాజేష్ ను పట్టుకొని ఆమె కన్నీళ్లు పెట్టుకొంది. 

పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులు వారించినా కూడ ఆమె వినలేదు. దీంతో ఖంగుతిన్న పెళ్లి కొడుకు వెంటనే పంచాయితీ పెట్టాడు. పంచాయితీలో అసలు విషయాన్ని బయటపెట్టింది వధువు మౌనిక. తాను రాజేష్ ను ప్రేమించినట్టుగా స్పష్టం చేసింది. పెద్దలు నిర్ణయించినందున ఈ పెళ్లి చేసుకొన్నట్టుగా చెప్పింది.

గ్రామ పెద్దలతో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది పంచాయితీ. ఈ పెళ్లిని రెండు కుటుంబాలు రద్దు చేసుకొన్నాయి. మౌనిక ఇష్టపడిన రాజేష్‌తో ఈ నెల 13వ తేదీన పెళ్లి చేశారు. రెండు రోజుల వ్యవధిలో మౌనిక రెండు పెళ్లిళ్లు చేశారు.

 పెద్దలు నిర్ణయించిన పెళ్లి రద్దైంది. చివరకు తాను ప్రేమించిన యువకుడితోనే పెద్దలు పెళ్లి చేయడంతో మౌనిక సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తానికి ఈ ఘటన సినిమాను తలపించేవిధంగా ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.