సిద్దిపేట: ఆన్‌లైన్ లో అప్పులు ఇచ్చే సంస్థ  ప్రతినిధుల వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకొంది.

సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన కిర్ని భూపాణి కూతురు మౌనిక. ఆమె వయస్సు 24 ఏళ్లు. ఆమె ఏఈఓగా పనిచేస్తోంది.  రెండేళ్లుగా ఆమె ఈ విధులను నిర్వహిస్తోంది. మౌనిక కుటుంబం కొంత కాలంగా సిద్దిపేటలో నివాసం ఉంటుంది.

మౌనిక తండ్రి వ్యాపారం చేసే క్రమంలో అప్పులపాలయ్యాడు. దీంతో కుటుంబ అవసరాల కోసం మౌనిక స్నాప్ ఇట్ లోన్ యాప్ నుండి రెండు మాసాల క్రితం రూ. 3 లక్షల అప్పు తీసుకొంది. నిర్ణీత గడువులోపుగా ఆమె ఈ అప్పును చెల్లించలేదు.

నిర్ధేశించిన సమయంలో అప్పును చెల్లించలేదు మౌనిక.  దీంతో అప్పును ఎగవేతదారునిగా ఆమెను ప్రకటించారు. ఆమె ఫోన్ లోని కాంటాక్టు నెంబర్లకు వాట్సాప్ సందేశాలు పంపారు.

దీంతో మనోవేదనకు గురైన మౌనిక ఈ నెల 14న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హైద్రాబాద్ లోని  గాంధీభవనప్ కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం నాడు తెల్లవారుజామున మరణించారు. 

మౌనిక సోదరుడు భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.