హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడానికి కారణం చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. 

ఏపీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు మరోసారి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

బాబు అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.  బాబు మోసపూరిత విధానాలు, వెన్నుపోటు కారణంగానే తెలంగాణలో టీడీపీ కనుమరుగైందన్నారు. తెలంగాణలో పురుడు పోసుకున్న టీడీపీకి ఈ పరిస్థితి వస్తుందని తాను అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

పార్టీ అభివృద్ధి కోసం జీవితం ధారపోశానని చెప్పుకొచ్చారు. విభజన తరువాత జాతీయ పార్టీగా ఉంటుందని చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని అమరావతికి పారిపోయారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. 

తెలంగాణలో బాబు, పార్టీని నమ్ముకున్న వారు ఏమై పోవాలని నిలదీశారు. దళితులంతా ఏకమవుతున్నారని, 20 ఏళ్లుగా వర్గీకరణ చేయని చంద్రబాబు కాపులకు ఏం చేస్తారని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు.