మద్యానికి బానిసైన తల్లి కన్నకూతురి పట్ల కర్కశంగా వ్యవహరించింది. రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. ఓ బస్సు ముందు విసిరేసింది. వివరాల్లోకి వెళితే.. బోయిన్‌పల్లికి చెందిన ఓ మహిళను భర్త వదిలేయడంతో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు రెండేళ్ల కుమార్తె ఉంది..

మంగళవారం మధ్యాహ్నం కుమార్తెను తీసుకుని కూకట్‌పల్లి భాగ్యనగర్‌కు వచ్చింది. స్థానికంగా కల్లు కాంపౌండ్ కనిపించడంతో ఫుల్లుగా తాగి.. ఆ మత్తులోనే సాయిబాబా ఆలయ మార్గం మీదుగా నడుచుకుంటూ వెళ్తోంది.

ఈ క్రమంలో బిడ్డను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లింది. అక్కడితో ఆగకుండా ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ ప్రైవేట్ మినీ బస్సు ముందు విసిరేసింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తృుటిలో ప్రమాదం తప్పింది.

ఆమె ప్రవర్తనను గమనిస్తున్న స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చిన్నారిని రక్షించి... మహిళను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తల్లీబిడ్డలను శిశువిహార్ సంరక్షణ కేంద్రానికి తరలించారు. తాగిన మత్తులో ఉండటం.. పైగా భర్త వదిలేసిన ఒంటరితనం కారణంగా ఆమె మానసిక ప్రవర్తన సరిగా ఉండకపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.