హైదరాబాద్:హైద్రాబాద్‌కు చెందిన  ఓ యువతి ఖతార్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతోందని... ఆమెను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని  బాధిత యువతి కుటుంబసభ్యులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ‌ను కోరారు.

ట్విట్టర్ వేదికగా హైద్రాబాద్‌కు చెందిన తబస్సుమ్ బేగం తన కూతురును రక్షించాలని  ఆమె సుష్మా స్వరాజ్ కోరారు.తన కూతురు నర్స్‌గా పనిచేసేదన్నారు. తన కూతురును ఓ ఏజంట్ కలిసినట్టుగా ఆమె గుర్తు చేశారు. ఖతార్‌లో అనారోగ్యంగా ఉన్న తన చెల్లెలిని  చూసుకొంటే నెలకు రూ. 40 వేలు చెల్లిస్తానని  నమ్మబలికినట్టుగా ఆమె చెప్పారు.

తన కూతురు ఖాతార్‌కు చేరుకొన్న వెంటనే ఆమెను చిత్ర హింసలు పెట్టడమే కాకుండా కనీసం భోజనం కూడ సరిగా పెట్టడం లేదని  తబస్సుమ్ బేగం చెప్పారు.  అంతేకాదు తన కూతురిని ఇంటి పనుల కోసం కూడ ఉపయోగించుకొంటున్నారని ఆమె ఆరోపించారు. 

తన కూతురును ఇండియాకు తిరిగి పంపేందుకు రూ. 1.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె సుష్మాస్వరాజ్‌కు చెప్పారు. తమది చాలా పేద కుటుంబమన్నారు. ఇంత డబ్బును ఎలా ఇవ్వగలమని ఆమె ప్రశ్నించారు.