హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో స్వంత కొడుకునే ప్రియుడితో కలిసి ఓ తల్లి దారుణంగా హతమార్చింది.ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకొంది.

హైద్రాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వినాయక‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వివాహిత వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటుంది. భర్తతో మనస్పర్థల కారణంగా  ఏడాదిన్నర క్రితం నుండి ఆమె విడిగా నివాసం ఉంటుంది.

ఆమెకు ముగ్గురు కొడుకులు. వీరిలో ఒకరు దివ్యాంగుడు. ఆమె స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ పిల్లలను పోషించుకొంటుంది.  తాను పనిచేసే ఫ్యాక్టరీలో కార్మికుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

వివాహేతర సంబంధం ఏర్పడిన కార్మికుడు ఇస్మాయిల్ నేరుగా ఆమె ఇంటికి వచ్చేవాడు. దివ్యాంగుడైన 8 ఏళ్ల కొడుకు ఈ విషయాన్ని గమనించాడు. 

తమ ఇంటికి రావొద్దని ఇస్మాయిల్ బాలుడు హెచ్చరించాడు. ఈ విషయాన్ని అందరికీ చెబుతానని చెప్పాడు. దీంతో తమ బందానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని తల్లి, ప్రియుడు ఇస్మాయిల్ భావించాడు.

ఈ నెల 22వ తేదీ ఉదయం ఇస్మాయిల్ ఆ బాలుడి గొంతును పట్టుకొని పిసికాడు.  బాలుడి తలను గోడకేసి కొట్టాడు. ఆ తర్వాత అపస్మాకరస్థితికి వెళ్లిన బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

కిందపడి బాలుడికి గాయాలైనట్టుగా చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.అయితే ఈ విషయంపై స్థానికులకు అనుమానం వచ్చింది.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు అసలు విషయాన్ని ఒప్పుకొన్నారు. బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. 
నిందితులను అరెస్ట్ చేశారు.