సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలను చూసి తట్టుకోలేక ఓ తల్లి వారిద్దరిని చంపి.. తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. 

సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ సమస్యలతో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి పట్టణం శాంతినగర్‌కు చెందిన శివశంకర్‌ బ్యాంకు ఉద్యోగి. ఆయనకు భార్య జ్యోత్స్నతో పాటు ఇద్దరు పిల్లలు రుద్రామ్ష్‌(6), దేవాన్ష్‌(4) ఉన్నారు. గత కొంతకాలంగా వీరికి అనారోగ్యం ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో తల్లి వారిని చంపేందుకు యత్నించింది.

పారాసిటమాల్‌ మాత్రలు మింగించేందుకు యత్నించగా పిల్లలు ప్రతిఘటించారు. దీంతో వారిద్దరి గొంతు నులిమి చంపేసింది. వారు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్‌ సాగర్‌ చెరువు దగ్గరికి వెళ్లింది. అక్కడి నుంచి తన భర్త శివశంకర్‌కు ఫోన్‌ చేసి తాను చెరువులో దూకి చనిపోతున్నాని చెప్పింది. తాను చెరువు వద్దనే ఉన్నాననే ఒక వీడియోను కూడా ఆయనకు పంపింది. అయితే జ్యోత్స్న చెరువులో దూకడాన్ని గమనించిన మత్స్యకారులు ఆమెను కాపాడారు. అంతలోపే పోలీసులు, ఆమె భర్త ఘటనాస్థలికి చేరుకున్నారు.

జ్యోత్స్నను పోలీసులు ఆమె భర్త శివశంకర్‌కు అప్పగించారు. తన భార్యను తీసుకొని ఇంటికి వెళ్లిన శివశంకర్‌ పిల్లలు చనిపోయిన విషయం తెలుసుకున్నాడు. దీనిపై భార్యను నిలదీయగా పిల్లల్ని చంపిన తర్వాతే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు చెప్పింది. తాను కూడా కొన్ని మాత్రలు మింగినట్లు భర్తకు ఆమె వివరించింది. దీంతో ప్రస్తుతం జ్యోత్న్సను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.