వనపర్తిలో విషాదం.. ముగ్గురు చిన్నారులతో సహా కాల్వలోకి దూకిన తల్లి.. ఒకరిని కాపాడిన స్థానికులు..
కుటుంబకలహాలు ఓ కాపురంలో చిచ్చుపెట్టాయి. మనస్తాపంతో ఓ తల్లి తన పిల్లలతో సహా కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. పెబ్బేరులో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనలో తల్లీ ఇద్దరు కూతుర్లు చనిపోగా.. కుమారుడిని కాపాడగలిగారు..
పెబ్బేరు : Family strifeతో విసిగిపోయిన ఓ woman ముగ్గురు పిల్లలతో సహా jurala canalలోకి దూకిన ఘటన wanaparthy జిల్లా pebberuలో చోటుచేసుకుంది. ఇందులో ఓ బాలుడిని స్థానిక యువకుడు రక్షించగా.. మిగతా ముగ్గురు మాత్రం గల్లంతయ్యారు. పెబ్బేరు ఎస్ఐ రామస్వామి, స్థానికుల కథనం ప్రకారం... పెబ్బేరు పట్టణానికి చెందిన డిసిఎం డ్రైవర్ తెలుగు స్వామి, భవ్యలు పదేళ్ల కిందట ప్రేమించుకుని, కులాంతర వివాహం చేసుకున్నారు.
వీరికి అయిదేళ్ల జ్ఞానేశ్వరి, మూడేళ్ల వరుణ్, ఏడాది వయసున్న నిహారిక సంతానం. కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో భార్యభర్తలు గొడవ పడుతున్నారు. ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన భవ్య.. ముగ్గురు పిల్లలను తీసుకుని రాత్రి ఏడున్నర గంటల సమయంలో పట్టణ సమీపంలో ఉన్న జూరాల ఎడమ ప్రధాన కాలువలోకి దూకింది. స్థానికులు గమనించి కేకలు వేయడంతో.. అటువైపు వెళుతున్న కుమార్ అనే యువకుడు మూడేళ్ల వరుణ్ ని కాపాడగలిగాడు.
తల్లి, ఇద్దరు కుమార్తెలు మాత్రం గల్లంతయ్యారు. విషయం తెలిసిన ఎస్ఐ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే రామన్ పాడు జలాశయం అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల నిలిపి వేయించారు. పూర్తి వివరాలు తెలుసుకుంటామని, ఉదయం గాలింపు చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటివరకు తమకు ఎవరూ దీని మీద ఫిర్యాదు చేయలేదని అన్నారు.
ఇదిలా ఉండగా, నిరుడు ఆగస్టులో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలు బావిలోకి తోసి, తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో కలకలం రేపింది.
'మీకు పెద్దపులిని చూపిస్త.. నాతో రండి'అని ఓ తల్లి తన ఇద్దరు కుమారులను గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడ పిల్లలతో కలసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, పెద్దకుమారుడు మృతిచెందగా, చిన్నకుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంకిష్టంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కిష్టంపేటకు చెందిన కస్తూరి సంపత్, లావణ్య(25) భార్యాభర్తలు. వీరికి గణేశ్ (8), హర్షవర్ధన్ (6) అనే కుమారులు ఉన్నారు. పదేళ్ల క్రితం స్టేషన్‌పూర్ నుంచి ఉపాధి కోసం కిష్టంపేట గ్రామానికి వచ్చారు. ఇక్కడే కూలీ పనిచేసుకుంటూ బతుకుతున్నారు.
శుక్రవారం భార్యాభర్తలు అల్లీపూర్ గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద కూలీ పనిచేసి ఇంటికి తిరిగి వచ్చారు.
కొద్ది సేపటి తర్వాత లావణ్య.. పెద్దపులిని చూపిస్తానంటూ తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావివద్దకు వెళ్లింది. తర్వాత ఇద్దరు కుమారులను పట్టుకుని బావిలో దూకింది. అయితే, ఈ ప్రయత్నంలో తల్లి, పెద్దకుమారుడు బావిలో పడిపోగా హర్షవర్ధన్ బావిగట్టు వద్దే ఉండిపోయాడు. వెంటనే బాలుడు అక్కడ ఉన్నవారికి ఈ విషయం చెప్పగా, వారు బావి వద్దకు చేరుకుని లావణ్య, గణేశ్ ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు నీటిలో మునిగి చనిపోయారు. పోస్టుమార్టం కోసం మృత దేహాలను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే లావణ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.