హైదరాబాద్: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తల్లి రాక్షసిలా తయారైంది. సహజీవనానికి అడ్డొస్తుందని భావించి ప్రియుడితో కలిసి దుర్మార్గానికి ఒడిగట్టింది. కూతురిని చిత్రహింసలకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతుంది. చివరికి ప్రియుడితో కలిసి దాడి చెయ్యడంతో ఆ చిన్నారి చెయ్యి విరిగి రోదిస్తున్నా ఆ తల్లి మనసు కరగలేదు. స్థానికులు చలించినా ఆమెలో మాత్రం మార్పురాలేదు. మానవత్వం మంట కలిపిన ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా ముకునూరు గ్రామానికి చెందిన సరితకు ఆరేళ్ల క్రితం వెంకన్న అనే వ్యక్తితో వివాహమైంది. ఆ దంపతులకు నాలుగేళ్ల కూతురు రేణుక ఉంది. ఐదేళ్లుగా సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో ఇరువురు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఇరువురు వేరువేరుగా ఉంటుంది. సరిత ముసారాంబాగ్ లోని ఈస్ట్ ప్రశాంత్ నగరర్ లో ఓ అపార్ట్మెంట్లో కూతురుతో కలిసి అద్దెకు ఉంటుంది. 

అయితే ఒంటరిగా ఉంటున్న సరితకు డీసీఎం డ్రైవర్ వెంకటరెడ్డి(35)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. తొమ్మిదినెలలుగా వెంకటరెడ్డి సరిత సహజీవనం చేస్తున్నారు. తమ సహజీవనానికి కూతురు రేణుక అడ్డువస్తుందని భావించిన సరిత కొట్టడం ప్రారంభించింది. రోజూ చిత్ర హింసలకు గురిచేస్తోంది. ప్రియుడితో కలిసి కొట్టినా ఆ చిన్నారి మౌనంగానే భరించింది. ప్రియుడి మోజులో పడి తల్లి రాక్షసిలా చిత్రహింసలకు గురిచేస్తున్నా ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితి పాపం ఆ చిన్నారిది. 

తల్లితోపాటు వెంకటరెడ్డి కూడా రేణుకను చిత్ర హింసలకు గురి చెయ్యడంతో ఆ చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరెడ్డి చిన్నారిని కొరకడంతో తీవ్ర రక్తస్రావమై కొన్ని రోజులపాటు అన్నం కూడా తినలేని దీనస్థితికి చేరుకుంది ముక్కుపచ్చలారని ఆ పసిపాప. రెండు రోజుల క్రితం ప్రియుడుతో కలిసి తల్లి కొట్టిన దెబ్బలకు రేణుక ఎడమ చెయ్యి విరిగింది. 

ఇరుగుపొరుగు వారు, స్థానికులు రేణుక పరిస్థితిని గమనించి సరితను నిలదీశారు. అయితే తమ వినకపోడం వల్లే కొట్టాల్సి వచ్చిందని సరిత సర్ది చెప్పి పంపించి వేసింది. గుచ్చిగుచ్చి అడగటంతో సరిత వారిని బెదిరించే ప్రయత్నం చేసింది. దీంతో వారంతా స్థానిక మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఆశ్రయించారు. జరుగుతున్న వ్యవహారం చెప్పి ఆ చిన్నారిని కాపాడాలని వేడుకున్నారు. 

దీంతో చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుతో కలిసి బాలిక ఇంటికి వెళ్లారు. అప్పటికే తీవ్రగాయాలతో బాధపడుతున్న బాలికను రెస్క్యూ హోమ్ కు తరలించారు. తల్లి సరిత, ప్రియుడు వెంకటరెడ్డిపై మలక్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సరితను మలక్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు వెంకటరెడ్డి తమిళనాడు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.