పెళ్లికి డబ్బులు సమకూరడం లేదని తల్లిలోపాటు ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే.. గోపాలపురం ప్రకాశ్ ఆయన భార్య గోవిందమ్మ(48), ఇద్దరు కుమార్తెలు రాధిక(30), రమ్య(28)లు గత 25 సంవత్సరాలుగా గాంధీ చౌక్ లో నివాసం ఉంటున్నారు.

ప్రకాశ్ మహబూబబాబాద్ లో బంగారం మెరుగుపెట్టే పనిచేస్తున్నాడు. ఉదయం వెళ్లి రాత్రి 10గంటల సమయానికి ఇంటికి చేరుకుంటాడు. కాగా.. ఇటీవల వారి పెద్ద కుమార్తె రాధికకు పెళ్లి కుదిరింది. జనవరి 11న పెళ్లి చేయాలని ముహుర్తం నిశ్చయించారు. అయితే.. వీరిది పేద కుటుంబం కావడంతో పెళ్లి కావాల్సిన డబ్బు కూడా సమకూర్చుకోలేకపోయారు. దీంతో.. మనస్తాపం చెంది తల్లీ, ఇద్దరు కూతుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు.

రాత్రి ఇంటికి వచ్చిన ప్రకాశ్ తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో పక్కనే ఉన్న బంధువులకు, పోలీసులకు సమాచారం అందించాడు. తలపులు పగలకొట్టి చూడగా.. ముగ్గురు విగతజీవులై కనిపించారు. ఆర్థిక సమస్యల కారణంగానే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.