హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా నగరవాసులను వణికిస్తున్న చలి...ఇవాళ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ చలి నుండి  కాపాడుకునేందుకు ఇంట్లో ఏర్పాటు చేసుకున్న బొగ్గుల కుంపటి కారణంగా తల్లీ, కొడుకులు మృత్యువాత పడ్డారు. 

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తూర్నుగోదావరి జిల్లా పిఠాపురంకు చెందిన బుచ్చివేణి అనే మహిళ ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చింది. జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. అదే ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో వాచ్ మెన్ కోసం నిర్మించిన చిన్న రూంలో కొడుకు పద్మారావుతో కలిసి నివాసముంటోంది. 

అయితే గత రెండు రోజులుగా చలి విపరీతంగా ఉండటంతో వీరు గదిలో బొగ్గుల కుంపటి పెట్టారు. దీని కారణంగా వీరి గదిలో విపరీతమైన పొగ వ్యాపించింది. దీంట్లో చిక్కుకున్న తల్లీ, కొడుకులు ఊపిరాడక మృతిచెందారు.     

వీరి గదిలోంచి విపరీతమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెళ్లి తలుపులు బద్దలుగొట్టి చూడగా తల్లీ, కొడుకులు అప్పటికే చనిపోయారు.  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.