వైద్యం సకాలంలో అందకపోవడంతో ఓ తల్లీబిడ్ మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
మహబూబ్ నగర్ జిల్లా : సకాలంలో వైద్యం అందక.. ఒక గర్భిణి, ఆమెకు పుట్టిన నవజాత శిశువు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ లో విషాదం నింపింది. గర్భిణీ పురుటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్చడానికి 180 కిలోమీటర్లు తిరిగారు. ఐదు ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోయింది. సకాలంలో వైద్యం అందక పోవడంతో పురుడు పోసుకున్న తర్వాత తల్లి, బిడ్డ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మృతురాలి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…
నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం వంకేషను గ్రామానికి చెందిన స్వర్ణ అనే మహిళకు రెండేళ్ల క్రితం అమ్రాబాద్ మండలం పల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ తో పెళ్లయింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ హైదరాబాదులో నివాసముంటున్నారు. ఇటీవల స్వర్ణ గర్భవతి అయింది. దీంతో రెండు నెలల క్రితం డెలివరీ కోసం తల్లిగారి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో నెలలు నిండడంతో సోమవారం రాత్రి 8 గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన తల్లిదండ్రులు ఆమెను మొదట పదరా, అమ్రాబాద్ ఆసుపత్రులకు తీసుకు వెళ్లారు.
వ్యక్తిగత సమస్యలపై చర్చ వద్దు: గాంధీ భవన్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
అక్కడ వైద్యులు పట్టుకోకపోవడంతో అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే జనరల్ ఆస్పత్రిలో కూడా వైద్యులు స్వర్ణకు ప్రాథమిక చికిత్స మాత్రమే చేశారు. తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి పంపించారు. అలా ఆస్పత్రుల కోసం 180 కిలోమీటర్లు తిరుగుతూ అర్ధరాత్రి రెండున్నర గంటలకు మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ డాక్టర్లు స్వర్ణ కు నార్మల్ డెలివరీ చేశారు.
అయితే పుట్టిన వెంటనే శిశువు మృతి చెందింది. ఊపిరి పీల్చుకోవడంలో కష్టమవడంతో శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే బాలింత అయిన స్వర్ణకు ఫిట్స్, గుండెపోటు వచ్చాయి. దీంతో ఆమె కూడా మృతి చెందింది. పండంటి పాపాయితో ఇల్లు కళకళలాడుతుంది అనుకుంటే.. తల్లి బిడ్డ ఇద్దరి మృతితో విషాదం అలుముకుంది. తల్లి బిడ్డ మృతికి వైద్యం సకాలంలో అందక పోవడమే కారణమని వైద్యులు నిర్ధారించారు.
