ఈ నెల ఎనిమిదవ తేదీనుంచి జరుగుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ తల్లీకూతుళ్లు విజయం సాధించి.. అపురూపమైన ఘట్టానికి తెరలేపారు.
ఖమ్మం : ఒకే రకమైన పరీక్షల్లో సత్తా చాటిన తల్లీ కూతుళ్లు ఇప్పుడు..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఖమ్మంకు చెందిన తల్లీకూతుళ్లు ఎస్సై దేహదారుఢ్య పరీక్షల్లో తల్లీకూతుళ్ళు సత్తా చాటారు. ఒకేసారి దీనికి సంబంధించిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఒకేసారి ఫైనల్ ఎగ్జామ్స్ కు అర్హత సాధించి అపురూపమైన రికార్డు కొట్టేశారు. ఇది ఖమ్మం పరేడ్ మైదానంలో బుధవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన దారెళ్లి నాగమణి (37) ఆమె పోలీస్ కానిస్టేబుల్. ఎస్ఐ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. నాగమణి కూతురు త్రిలోకిని (21) కూడా తల్లి బాటలోనే నడవాలని అనుకుంది.
ఆమె కూడా కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంది. త్రిలోకిని పిజీ చదువుతోంది. నాగమణిది నిరుపేద కుటుంబం. ఆమె భర్త వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. క్రీడలంటే నాగమణి చాలా ఇష్టం. ఆమెకున్న ఆసక్తిని గమనించిన భర్త ఆమెను ప్రోత్సహించాడు. డిగ్రీ వరకు చదువుకున్నారు. హ్యాండ్ బాల్ జాతీయస్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత కొన్నాళ్లు ఖమ్మంలో అంగన్వాడీ టీచర్ గా పని చేశారు. 2007లో హోంగార్డుగా ఉద్యోగం సంపాదించారు. 2018 వరకు హోంగార్డుగా కొనసాగారు. ఆ తర్వాత పట్టుదలతో చదువుకొని పరీక్ష రాసి సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికయింది. ఎప్పటికైనా ఎస్సై కావాలన్నది నా లక్ష్యం అని నాగమణి చెప్పారు.
ఆమె కూతురు త్రిలోకిని కూడా తల్లి బాటలోనే పయనించి కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంది. ఎస్సై ఉద్యోగానికి ప్రిలిమ్స్లో అర్హత సాధించింది. తల్లితో కలిసి ములుగులో ఈవెంట్ల కోసం సాధన చేస్తోంది. అమ్మలాగే పోలీసు ఉద్యోగం సాధించాలన్నది తన లక్ష్యం అని త్రిలోకిని చెప్పుకొచ్చింది.
