Asianet News TeluguAsianet News Telugu

పక్షవాతంతో ఉన్న వృద్ధురాలిపై కోతుల దాడి.. ముఖం, నడుము, కాళ్లను కొరికేయడంతో.. మంచంపైనే మృతి...

సూర్యాపేటలో దారుణం ఘటన చోటు చేసుకుంది. కోతుల బెడద ఓ వృద్ధురాలి ప్రాణాలు తీసింది. పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆమె మీద కోతులు దాడిచేసి చంపేశాయి.

monkeys attack on a old women died in suryapet
Author
First Published Sep 27, 2022, 1:03 PM IST

సూర్యాపేట :  సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం, పాత సూర్యాపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలిపై వానరమూక దాడికి దిగడంతో ఆమె మరణించింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… మెట్టు లింగమ్మ అనే మహిళకు రెండు నెలల క్రితం పక్షవాతం సోకింది. దీంతో ఆమె కదలలేని స్థితికి చేరుకుంది. ఆమె కోసం కొడుకు శంకర్ రెడ్డి ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేశాడు. 

శంకర్ రెడ్డి దంపతులు పొలం పనులకు వెళ్లడంతో గదిలో ఒంటరిగా ఉన్న లింగమ్మ మీద అటుగా వచ్చిన కోతులు దాడి చేశాయి. ఆమె ముఖం, నడుము, కాళ్లను ఇష్టారాజ్యంగా కరిచాయి.  వీరి ఇల్లు వీధి చివరన ఉంది. దీంతో గ్రామస్తులు కోతుల దాడిని గమనించలేకపోయారు. పక్షవాతంతో అచేతనంగా ఉన్న వృద్ధురాలు కోతుల దాడితో తీవ్ర గాయాలపాలై.. పంచ మీదనే ప్రాణాలు విడిచింది.

ఇది జరిగిన చాలాసేపటికి.. వీరి ఇంటికి రోజూ తాగునీరు తీసుకెళ్లేందుకు వచ్చే ఎస్సీ కాలనీ వాసులు వచ్చారు. నీరు పట్టుకునేందుకు వారు ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా, గాయాలపాలై  అచేతనంగా ఉన్న లింగమ్మ కనిపించింది. వారు వెంటనే శంకర్ రెడ్డికి సమాచారం అందించారు. ఇంటికి వచ్చిన శంకర్ రెడ్డి వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. ఆమె అప్పటికే మరణించినట్లు తెలిసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఇదిలా ఉండగా, అన్నమయ్య జిల్లా బ్రహ్మంగారి మఠంలో గత శుక్రవారం పందులు దాడి చేయడంతో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. సిద్దమ్మ ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో పందులు దాడి చేశాయి. "మహిళ కన్నును పందులు పూర్తిగా నమిలేశాయి. ఆమె అరచేతులతో పాటు ఆమె వేళ్లు కూడా కొరికేశాయి" అని సమాచారం. పందుల దాడిని గమనించిన చుట్టుపక్కల ప్రజలు, ఆమె కుటుంబ సభ్యులు మహిళను రక్షించేందుకు ఘటనాస్థలికి చేరుకునేసరికే ఈ ఘోరం జరిగిపోయింది. వెంటనే పందులను తరిమికొట్టిన ఆమెను స్థానిక బ్రహ్మంగారి మఠం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

జగన్ ను ఒప్పించి ఏపీలో షర్మిలను సీఎం చేయండి: విజయమ్మకు జగ్గారెడ్డిసలహా

బ్రహ్మంగారి మఠంలోని తపాలా కార్యాలయం వీధిలో నాగిరెడ్డి సిద్దమ్మ (80) నివసిస్తోంది. రోజూలాగే ఆమె ఆరుబయట మంచంమీద నిద్రిపోతోంది. ఉదయం పదిగంటల సమయంలో టిఫిన్ పెట్టాలని.. అది తయారుచేయడానికి కాసేపటి క్రితమే కూతురు ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలోనే పందుల గుంపు సిద్ధమ్మ మీద దాడి చేసింది. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇంటి బయట అలికిడి విని కూతురు బయటికి వచ్చేసరికి.. జరుగుతున్న దారుణం కనిపించింది. వెంటనే గట్టిగా కేకలు వేయడం ఇరుగు,పొరుగు వారు వచ్చి పందులను తరిమేశారు. 

టెంపుల్ టౌన్ లో పందుల బెడదను నియంత్రించడంలో స్థానిక పౌర అధికారులు విఫలమయ్యారని బ్రహ్మగారి మఠం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో పందులను నియంత్రించాలని గ్రామపంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు.శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనం కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కానీ ఇప్పటి వరకు కనీస భద్రతా చర్యలు చేపట్టలేదని వాపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios