టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో తుషార్ పిటిషన్
సిట్ దర్యాప్తపై స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టులో తుషార్ సోమవారంనాడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని కూడా ఆయన ఆ పిటిషన్ లో కోరారు.
హైదరాబాద్: సిట్ దర్యాప్తుపై స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టులో తుషార్ సోమవారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.ఈ నెల 21న విచారణకు రావాలని తనకు సిట్ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే అనారోగ్య కారణాలతో విచారణకు రావడానికి తనకు రెండు వారాల సమయం కోరినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు తాను మెయిల్ చేసినట్టుగా చెప్పారు అయితే తన మెయిల్ కి రిప్లై ఇవ్వకుండానే లుకౌట్ నోటీసులు జారీ చేయడం రాజకీయ దురుద్దేశంగా ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. అంతేకాదు సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కూడా ఆ పిటిషన్ లో కోరారు తుషార్. రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తుందని తుషార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు తుషార్.
ఈ నెల 21న తుషార్ , జగ్గుస్వామి, బీఎల్ సంతోష్ లను విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ముగ్గురు కూడా విచారణకు రాలేదు. అయితే బీఎల్ సంతోష్ కి బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ పోలీసుల సహాయంతో సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో విచారణ సమయంలో మరోసారి నోటీసులు పంపాలని ఆదేశించింది.దీంతో ఈ నెల 23న బీఎల్ సంతోష్ కి సిట్ మరోసారి నోటీసులు పంపింది.ఈ నోటీసులపై సంతోష్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జారీ చేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 25న సంతోష్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు సిట్ నోటీసులపై స్టే ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే కొనసాగుతుందని ప్రకటించింది హైకోర్టు. ఇదిలా ఉంటే ఈ కేసుపై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.