Asianet News TeluguAsianet News Telugu

మొయినాబాద్ ఫామ్ హౌస్‌ కేసు.. కేరళలో సిట్ బృందం సోదాలు.. పరారీలో ప్రముఖ వైద్యుడు..!

మొయినాబాద్ ఫామ్ హౌస్‌ కేసును విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తును మమ్మరం చేసింది. అయితే కేరళలో విచారణ జరిపేందుకు సిట్ అధికారులు వెళ్లిన సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 

Moinabad farm house case Sit Investigation in kerala
Author
First Published Nov 14, 2022, 12:30 PM IST

మొయినాబాద్ ఫామ్ హౌస్‌ కేసును విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తును మమ్మరం చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని నిందితులకు సంబంధించి ప్రదేశాల్లో సిట్ బృందాల దర్యాప్తు చేపట్టాయి. హర్యానా, కర్ణాటకలలోని రామచంద్ర భారతి నివాసాలు, తిరుపతిలోని సింహయాజీ ఆశ్రమంపై కూడా సిట్ బృందాలు ఆపరేషన్ నిర్వహించాయి. షేక్‌పేటలోని నందకుమార్‌ ఇంట్లో, ఫిలింనగర్‌లోని హోటల్‌లో కూడా సిట్ బృందాలు సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా దాదాపు పది చోట్ల సోదాలు జరిగాయి.

ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ కస్టడీ సమయంలో లభించిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. సిట్ అధికారులు 7 బృందాలుగా విడిపోయి వివిధ నగరాలకు వెళ్లి దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని డాక్యుమెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

అయితే కేరళలో విచారణ జరిపేందుకు సిట్ అధికారులు వెళ్లిన సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొచ్చిలో రామచంద్ర భారతి మధ్యవర్తిగా ఉన్న ఓ ప్రముఖ వైద్యుడి నివాసంలో కూడా సోదాలు జరిపాయి. అయితే సిట్ అధికారులు వస్తున్న సమాచారం ముందుగానే తెలుసుకున్న ఆ వైద్యుడు  తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో సిట్ అధికారులు కేరళ పోలీసుల సహాయంతో ఆ వైద్యుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. 

అయితే ఆ వైద్యుడికి కూడా ఆధ్యాత్మిక నేపథ్యం ఉందని సమాచారం. రామచంద్రభారతికి సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి కావడంతో పోలీసులు అతడిని విచారించేందుకు కొచ్చిలో అతని ఆశ్రమానికి వెళ్లారు. అయితే పోలీసులు వస్తున్నారని ఆశ్రమంలోని ఇన్ చార్జ్ సమాచారం అందించడంతోనే వైద్యుడు తప్పించుకున్నాడని తెలుస్తోంది. అయితే ఆ వైద్యుడి ఆచూకీ తెలిస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios