Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన ముగ్గురు నిందితులు..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ,  నందకుమార్, సింహయాజీలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

Moinabad farm house case Accused Approach Supreme Court Challenging their arrest
Author
First Published Nov 1, 2022, 12:21 PM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ,  నందకుమార్, సింహయాజీలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకోవడానికి అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ అంశాన్ని ముగ్గురు నిందితుల తరపున న్యాయవాదులు.. సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని అభ్యర్థించారు. అయితే నిందితుల పిటిషన్‌ను శుక్రవారం లిస్ట్ చేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆదేశించారు. 

ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులకు తొలుత ఏసీబీ కోర్టు రిమాండ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టేసి నిందితులకి రిమాండ్‌ విధించాలని పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిందితుల రిమాండ్ రిజెక్ట్‌ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీసు కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేసి అవినీతి నిరోధక శాఖ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. 

ఈ క్రమంలోనే పోలీసులు ముగ్గురు నిందితులను మళ్లీ అరెస్ట్ చేసి.. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే  నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 11 వరకు రిమాండ్‌ విధించినట్లు చెప్పారు.

ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు నిందితుల ఆరోగ్య సమస్యలపై వారి తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios