హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఏ) అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ అజరుద్దీన్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ కాంగ్రెసు కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఆయన కాంగ్రెసు కార్యకలాపాలకు పూర్తిగా దూరమయ్యారు. 

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకత ఎదరువుతున్నా అజరుద్దీన్ నోరు తెరవడం లేదు. ఆ అంశాలపై తన అభిప్రాయాన్ని ఇప్పటి వరకు వెల్లడించలేదు.

సిఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా డిసెంబర్ 28వ తేదీన కాంగ్రెసు పార్టీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి అజరుద్దీన్ హాజరయ్యేలా చూడాలని తెలంగాణ మైనారిటీ కాంగ్రెసు నేతల నుంచి నాయకత్వంపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. 2018 ఎన్నికల్లో అజరుద్దీన్ మహాకూటమి కోసం ప్రచారం సాగించారు. 

లోకసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అజరుద్దీన్ ఆసక్తి కనబరిచారు. అయితే, ఆయనకు కాంగ్రెసు నాయకత్వం ఆ అవకాశాన్ని కల్పించలేదు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరుతారంటూ ప్రచారం సాగింది. కానీ, ఆ పనిచేయలేదు.

తాను కాంగ్రెసులో చేరుతున్నట్లు సాగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు కూడా. అయితే, ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీ రామారావుకు అతి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కూడా ఆయన సన్నిహితంగానే ఉన్నారు. టీఆర్ఎస్ నాయకత్వం వల్లనే ఆయన హెచ్ సిఏ అధ్యక్షుడిగా గెలిచారనే ప్రచారం కూడా ఉంది.