Asianet News TeluguAsianet News Telugu

మోడిపై ముప్టేట దాడి

పెద్ద నోట్ల  రద్దు వ్యవహారం భాజపాలోకి కీలకమైన నేతలతో పాటు మోడికి కావాల్సిన బడా వ్యాపారులు, పలువురు ముఖ్యమంత్రులకు ముందే తెలుసన్నట్లుగా జరుగుతున్న ప్రచారం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది.

MODI

 

రోజులు గడిచే కొద్దీ ప్రధానమంత్రి నరేంద్రమోడిపై ముప్పేట దాడి పెరిగిపోతోంది. మొన్నటి వరకూ చెలామణిలో ఉన్న వెయ్యి, 500 రూపాయల నోట్లను హటాత్తుగా రద్దు చేయటంతో దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. అయితే రద్దు చేసిన 9వ తేదీ రాత్రి ప్రజలకు రద్దు ప్రభావం పెద్దగా అర్ధం కాలేదు. కానీ మరుసటి రోజు, ఆ తర్వాతి రోజు గడిచేకొద్దీ సమస్యలు ప్రత్యక్షమై జనజీవనం ఒక విధంగా స్తంబిచిపోయింది.

   అప్పటి వరకూ అందరి దగ్గరా ఉన్నది రద్దైన పెద్ద నోట్లే కావటంతో నిత్యావసరాలకు, ఇతర అవసరాలకు కావాల్సిన చిల్లర నోట్లు లేకపోవటంతో ఒక విధంగా దేశం మొత్తం మీద ఆర్ధిక అత్యవసర పరిస్ధితి పెట్టినట్లైంది. షాపులో వస్తువులున్నా అమ్ముకునేందుకు లేదు. జేబులో డబ్బులున్నా కొనేందుకు లేదు. బండిలో పెట్రోలున్నా ఎవరినీ ఎక్కించుకునుందుకు లేక చేతిలో డబ్బులున్నా బండ్లు ఎక్కేందుకు లేక ప్రజల అవస్తలు చెప్పనలవి కాదు. ఎందుకంటే, అప్పటి వరకూ జనాల చేతుల్లో ఉన్నది వెయి, 500 రూపాయల నోట్లే.

  కేంద్రప్రభుత్వం ఆ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించటంతో ఎవరూ సదరు నోట్లను తీసుకోవటానికి ఇష్ట పడలేదు. దాంతో జాతీయ స్ధాయిలో దుమారం రేగింది. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రాత్రి నుండి అధికార భారతీయ జనతా పార్టీ ఒక పద్దతి ప్రకారం సోషల్ వెబ్సైట్లలో మోడిని హీరోగా, దేశాన్ని ఉద్దరించేందుకే జన్మించిన నేతగా ఆకాశానికి ఎత్తేసింది. అయితే, మరుసటి రోజు, ఆ తర్వాత రోజు నుండి సదరు మోడి పొగడ్తలు తగ్గిపోవటం గమనార్హం.

  అదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను టివిల ద్వారా కళ్లకు కట్టినట్లు కనబడతుండటంతో ప్రధానమంత్రిపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. నల్లధనం అరికట్టే పేరుతో ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రత్యమ్నాయ చర్యలు చేపట్టకుండా పెద్ద నోట్ల రద్దను హటాత్తుగా ప్రకటించటంతో కష్టాలన్నీ సామాన్యులకే చుట్టుకున్నాయి. కొంత కాలం నుండి బ్యాకుంలు పెద్ద నోట్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ 100, 50 రూపాయల చెలామణిని నిరుత్సాహరచటంతో చిన్ననోట్లు ప్రజల వద్ద పెద్దగా కనబడటం లేదు.

  చిన్న నోట్లు లేక, పెద్ద నోట్లు తీసుకునే వారు లేక, బ్యాంకుల వద్ద కూడా చెలామణికి అవసరమైన డబ్బులు అందక, లక్ష్లాలాది  ఏటిఎంలు పనిచేయక పోవటంతో ప్రజలకు నరకం కనబడుతోంది. పరిస్ధితిని గమనించిన ప్రతిపక్షాలు, మమతబెనర్జీ, అరవింద్ కేజ్రివాల్, కెసిఆర్ లాంటి ముఖ్యమంత్రులు, మెజారిటీ మీడియా కూడా ప్రధాని చర్యను బాహాటంగానే విమర్శిస్తుండటంతొ ప్రజల నిరసనకూడా మిన్నంటుతున్నది. దానికితోడు పెద్ద నోట్ల  రద్దు వ్యవహారం భాజపాలోకి కీలకమైన నేతలతో పాటు మోడికి కావాల్సిన బడా వ్యాపారులు, పలువురు ముఖ్యమంత్రులకు ముందే తెలుసన్నట్లుగా జరుగుతున్న ప్రచారం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios