Women Reservation Bill: 'నూతన అధ్యాయానికి నాంది' : కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత
Women Reservation Bill:ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం భేటీ లో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ తరుణంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు

Women Reservation Bill: సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపటి నుంచి నూతన పార్లమెంట్ భవనం లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజే సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టనున్నారని సమాచారం.
కాగా.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నందనీ, ఇది మన దేశంలోని ప్రతి ఒక్క మహిళ సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. మన దేశ పౌరులందరికీ, సోదరీమణులు, సోదరులందరికీ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. లోక్‌సభలో అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఈ బిల్లు ఆమోదం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరగాలని ఆశించారు.
ఈ బిల్లుతో దేశ అభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందని అన్నారు. ప్రధానంగా చట్టాల తయారీలో మహిళలకు ఉన్నత స్థానం లభిస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కదిలి వచ్చిందని అన్నారు. బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ప్రవేశబెట్టబోయే ఈ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని పేర్కొన్నారు.
ఈ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, కేబినెట్ నిర్ణయాలు అధికారికంగా చెబితే బాగుంటుందని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో ఎప్పుడు ఈ బిల్లు ప్రవేశ పెట్టినా.. ఏదో ఒక పార్టీ అడ్డుకునేదని అన్నారు. దేశ రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషించే సమయం ఆసన్నమైందని అన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, చట్టాల రూపకల్పనలో ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికిందని అన్నారు. ఈ బిల్లుతో మహిళా సాధికారత, సాధికారత భారతదేశం కల నెరవేరుతుందని అన్నారు.