గవర్నర్ తమిళిసై తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దం..: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై కవిత స్పందించారు. ఈరోజు కవిత అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యంగబద్ద పదవుల్లో ఉన్నవారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన జాబితాను గవర్నర్ ఆమోదించడం సంప్రదాయబద్దంగా వస్తుందని చెప్పారు. ప్రభుత్వం పంపిన పేర్లను అనేక కారణాలు చెప్పి గవర్నర్ తిరస్కరించారని అన్నారు.
నిరంతం ప్రజల్లో నెగిటివ్ చర్చ రెకేత్తించడం తప్పితే దీని వల్ల ఒరిగిందేమి లేదని అన్నారు. బీసీ వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది గవర్నర్ మరోసారి నిరూపించారని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడకుండా వివాదస్పదంగా మార్చడం వల్ల.. బీసీ వర్గాలకు నష్టం జరుగుతుందని చెప్పారు. బీసీ వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. బీసీ వర్గాలకు బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తుందని విమర్శించారు. గవర్నర్‌గా వచ్చిన వ్యక్తుల బ్యాగ్రౌండ్ కూడా చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలతో ముడిపడి ఉంటుందని అన్నారు.
ఇక, గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ఎమ్మెల్సీ నామినేషన్లను గవర్నర్ తమిళిసాయి సౌందరరాజన్ తిరస్కరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయగా.. గవర్నర్ అందుకు అంగీకారం తెలుపలేదు. రాజ్యాంగంలోని 171(3), 171(5) అధికరణల్లో నిర్దేశించిన మేరకు ఆయా రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యత గానీ, ఆచరణాత్మక అనుభవం వారికి లేదని.. అందువల్లే వారి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తున్నట్టుగా చెప్పారు. అయితే గవర్నర్ నిర్ణయంపై మంత్రులు, బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.