తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అనుకున్న లక్ష్యాలను సాధించుకున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని చెప్పారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అనుకున్న లక్ష్యాలను సాధించుకున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు లాభం కలిగే ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో బతుకమ్మను ఎత్తుకోవాలంటే సిగ్గుపడేవారని.. ఇప్పుడు అందరూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్నారని చెప్పారు.
దేశంలో ప్రజలు ఎన్నుకున్న 8 ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని విమర్శించారు. దేశంలో ఎక్కడ కూడా నిరసన తెలిపే పరిస్థితి లేదన్నారు. బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపినవారిని చేస్తే ఏజెన్సీలతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. వ్యక్తులను, వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తుందని అన్నారు. లేనిపోని లీకులిచ్చి నేతల వ్యక్తిత్వాలను దెబ్బతీస్తుందని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి తరపున దేశం అంతా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థను మనం కాపాడుకుంటే.. వ్యవస్థలే మనల్ని కాపాడుతాయని అన్నారు. బీజేపీ అరాచకాలను అడిగేటోళ్లు ఎవరూ లేరని.. దీనిపై యువతలో చైతన్యం తీసుకురావాలని అన్నారు.
ఆనాడు ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒక పత్రిక ముందు పేజీకి ఖాళీగా వదిలేసిందన్నారు. కానీ ఇప్పుడు కొన్ని పత్రికలు ఏక్‌నాథ్ షిండేలను ఆకాశానికి ఎత్తుతున్నాయని విమర్శించారు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఏజెన్సీలతో దాడులు చేస్తున్నారని.. అది తన ఒక్కదానిపైనే దాడి కాదని.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఏజెన్సీల దాడులతో సమయం వృథా చేస్తున్నారని.. అయితే మిగిలిన సమయంలో ఇంకా ఎక్కువగా పనిచేయాల్సి ఉందని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు రావని.. నిప్పులు వస్తాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏజెన్సీల దాడులకు భయపడేది లేదని.. వెనక్కి తగ్గేది లేదని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకే వెళ్తామని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి చేసిన పనినే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చేయాల్సి ఉందన్నారు. దేశవ్యాప్తంగా కవులు, కళాకారులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులను ఏకం చేస్తామని చెప్పారు. 33 జిల్లాల్లో దాదాపు 12 వేల గ్రామాల్లో జాగృతికి కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. 18 దేశాలలో జాగృతి కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్రలో గత ఐదేళ్ల నుంచి బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయని చెప్పారు. అనేక సంస్థలు జాగృతితో కలిసి రావడానికి సిద్దంగా ఉన్నాయని చెప్పారు. ఒక్క పిలుపు ఇస్తే ప్రతీ రాష్ట్రంలో జాగృతికి ఒక శాఖ సిద్దమవుతుందని అన్నారు.
