నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో  టీఆర్ఎస్  అభ్యర్థిగా బరిలోకి దిగే  బాజిరెడ్డి గోవర్థన్‌ను ఓడిస్తానని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి  సంచలన  వ్యాఖ్యలు చేశారు.  బాజిరెడ్డి గోవర్థన్, భూపతి రెడ్డిలు గతంలో ఒకరిపై మరోకరు  పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేసుకొన్నారు. అంతేకాదు వీరిద్దరూ కూడ పరస్పరం కేసులు కూడ పెట్టుకొన్నారు. 

భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. డీఎస్ కు భూపతిరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. బాజిరెడ్డి గోవర్థన్ కు డీఎస్ కు కూడ పడదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కూడ బాజిరెడ్డికి, డీఎస్ కు పొసగని పరిస్థితులు ఉన్నాయి. మరో వైపు టీఆర్ఎస్ లో  చేరిన తర్వాత కూడ ఇవే పరిస్థితులు ఉన్నాయి. డీఎస్ అనుచరుడిగా ఉన్న భూపతిరెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.పలుమార్లు ఒకరిపై మరోకరు ఫిర్యాదులు కూడ చేసుకొన్నారు. పోలీస్ స్టేషన్లో కూడ కేసులు పెట్టుకొన్నారు.

నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుండి  బాజిరెడ్డి గోవర్థన్ పోటీ చేయనున్నారు. అయితే బాజిరెడ్డిని ఓడించేందుకు తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే భూపతిరెడ్డి బుధవారం నాడు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా  తాను పనిచేస్తానని ఆయన కుండబద్దలు కొట్టారు. 

ఒకవేళ తనకు టీఆర్ఎస్ టిక్కెట్టు ఇచ్చినా కూడ పోటీ చేయబోనని ఆయన చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని  ఆయన తేల్చి చెప్పారు. అయితే టీఆర్ఎస్ తప్ప  ఇతర పార్టీల నుండైనా పోటీచేస్తానని ఆయన చెప్పారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే విషయాన్ని  త్వరలోనే చెబుతానని ఆయన చెప్పారు. 

ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తే తాను కూడ వెంటనే  రాజీనామాలు చేస్తానని కూడ భూపతిరెడ్డి చెప్పారు.  తాను తప్పు చేస్తే ఎందుకు సస్పెండ్‌ చేయరని ప్రశ్నించారు. క్షమాపణ ఎందుకు చెప్పరు.. పొమ్మన లేక పొగ పెడుతున్నారని భూపతిరెడ్డి తెలిపారు.