కడియంపై వివాదాస్పద వ్యాఖ్యలు: అధిష్టానం నుండి పిలుపు, కేటీఆర్‌తో భేటీ కానున్న రాజయ్య
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. దీంతో ఇవాళ కేటీఆర్ తో రాజయ్య భేటీ కానున్నారు. కడియం శ్రీహరిపై రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఈ పిలుపు మేరకు రాజయ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం కానున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న తరుణంలో అధిష్టానం నుండి రాజయ్యకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కులంతో పాటు ఆయన తల్లిపై కూడ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కడియం శ్రీహరి రంగం సిద్దం చేసుకుంటున్నారని రాజయ్య ఆరోపణలు చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కూడ కడియం శ్రీహరి మంతనాలు చేశారని వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. తన తల్లి బీసీ, తన తండ్రి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడుగా కడియం శ్రీహరి పేర్కొన్నాడు.
also read:అవును నా తల్లి బీసీ, నా తండ్రి ఎస్‌సీయే: రాజయ్య వ్యాఖ్యలపై కడియం ఫైర్
తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుందని కడియం శ్రీహరి చెప్పారు. ఈ విషయమై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. అంతేకాదు ఈ విషయమై చట్టాలు కూడ ఉన్న విషయాన్ని కడియం శ్రీహరి గుర్తు చేశారు. తనపై తాటికొండ రాజయ్య చేసిన విమర్శలను కడియం శ్రీహరి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.