దళిత బంధు లబ్దిదారుల ఎంపిక విషయంలో ఎక్కడ తప్పుచేయలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) అన్నారు. తాను వ్యక్తిగత దూషణలు చేయనని చెప్పారు. 

దళిత బంధు లబ్దిదారుల ఎంపిక విషయంలో ఎక్కడ తప్పుచేయలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) అన్నారు. తాను వ్యక్తిగత దూషణలు చేయనని చెప్పారు. తనపై కారు కూతలు కూసేవారు జాగ్రత్త అని హెచ్చరించారు. దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యే రాజయ్య తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై వస్తున్న విమర్శలపై రాజయ్య స్పందించారు. 

ప్రజాప్రతినిధులు దళితబంధుకు అనర్హులా అని ప్రశ్నించారు. తన కుటుంబంలో కూడా పేదలు ఉన్నారని చెప్పారు. తన పాలొల్లలో చాలా మంది పేదవాళ్లు ఉన్నారని అన్నారు. తన సొంత చెల్లలకు సొంత ఇళ్లు కూడా లేవన్నారు. నా సొంత కుటుంబ సభ్యులు కంట్రోల్ బియ్యం తింటున్నారు.. అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. తనకు బంధువులైనంతా మాత్రం దళిత బంధు ఇవ్వొద్దంటే ఎలా ప్రశ్నించారు. 

ఇక, రాజయ్య తన తమ్ముడు సురేష్ దళిత బంధు పథకానికి ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సురేష్ ప్రస్తుతం స్టేషన్‌ఘన్‌పూర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కూడా ఉన్నారు. రాజయ్య తమ్ముడితో పాటు ఒకరిద్దరు స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు కూడా లబ్దిదారుల జాబితాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దళితబంధు పథకంలో రాజయ్య ప్రదర్శించిన బంధుప్రీతి.. రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజయ్యపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. 

ఈ క్రమంలోనే దళితబందు పథకాన్ని వదులుకుంటున్నట్టుగా రాజయ్య తమ్ముడు సురేష్ చెప్పారు. తన ఆర్థిక పరిస్థితి తెలుసకు కాబట్టే ఎమ్మెల్యే రాజయ్య.. దళితబంధు లబ్దిదారునిగా ఎంపిక చేశారని చెప్పారు. ఎమ్మెల్యేతో బంధుత్వం కారణంగా దళిత బంధు అర్హత లేదనడం సరైనది కాదన్నారు. రాజయ్యపై విమర్శలు రాకూడదనే తాను దళిత బంధు పథకాన్ని వదులుకుంటున్నట్టుగా చెప్పారు. సురేష్‌తో పాటు దళిత బంధు ఎంపిక జాబితాలో ఉన్న పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు.. స్వచ్చందంగా వైదొలుగుతున్నట్టుగా చెప్పారు.