దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, ఆయన కుమారుడు సతీష్‌ రెడ్డితో పాటు మనవడు, మనవరాలుకు కూడా కరోనా పాజిటీవ్‌గా నిర్దారణ అయ్యింది. మంగళవారం నాడు దుబ్బాక సీహెచ్‌సీలో 25 మందికి కోవిడ్‌ ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించారు. వీరిలో నలుగురుకి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. 

దీంతో వారు చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. రామలింగారెడ్డి మరణం నుంచి సంతాప సభ వరకు తమతో కలసి ఉన్నవారు. తమను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు కోరారు.

 ఇటీవల రామలింగారెడ్డి చనిపోయిన నేపథ్యంలో ఆయన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ సహా చాలా మంది కీలక నేతలు హాజరయ్యారు. అంతేకాదు.. రామలింగారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించేందుకు, 11వ రోజున నిర్వహించే కార్యక్రమానికి ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. తాజాగా రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా అని తేలడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. రామలింగారెడ్డి ఇంటికి వెళ్లిన నేతలందరూ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.