తెలంగాణలో కాంగ్రెస్ కి మరో దెబ్బ తగిలింది. వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి.. కాంగ్రెస్ ని వీడి కారు ఎక్కేశారు. ఈ మేరకు ఆయన గురువారం మంత్రి మహేందర్ రెడ్డిని కలిశారు.

గత నాలుగు రోజులుగా రోహిత్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ రోజు మంత్రి మహేందర్ రెడ్డి కలవడంతో.. అది నిజమని తేలింది. బంజారాహిల్స్ లోని మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ రోహిత్ ఆయనను కలిశారు. పూలబోకే అందజేసి మంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం తాండూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేద్దామని ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేకి సూచించారు.

ఏడాది క్రితం టీఆర్ఎస్ నుంచి బహిష్కణకు గురైన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా.. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. అయితే.. రోహిత్ రెడ్డి.. టీఆర్ఎస్ చేరికతో తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కడం కూడా కష్టమేనని అనిపిస్తోంది.