తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్.. ఖానాపూర్‌లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్.. ఖానాపూర్‌లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరతానని.. బీఆర్‌ఎస్‌ను ఓడిస్తానని ప్రకటన చేశారు. అయితే ఈ క్రమంలోనే అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం రేఖా నాయక్‌ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 

రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. మహబూబ్‌బాద్ ఎస్పీగా పని చేస్తున్నా శరత్‌ చంద్రపవార్‌ను (రేఖా నాయక్ కూతురు భర్త) సడెన్‌గా ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. అయితే ఇప్పుడు గతంలో రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్‌పై నమోదైన ఏసీబీ కేసును తిరగదోడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. 

రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్.. మోటర్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌గా పని చేసిశారు. ఈ మధ్యే వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఇటీవలే ఆయన హస్తం గూటికి చేరారు. అయితే వ్యామ్ నాయక్.. భోరజ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద పని చేసే సమయంలో ఆయనపై ఏసీబీ ఓ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఆ కేసునే బయటకు తీయించాలనే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది.

అయితే ఈ పరిణామాలపై రేఖా నాయక్‌తో పాటు ఆమె అనుచరులు మండిపడుతున్నారు. మరోవైపు తన కుటుంబంపై అవినీతి ఆరోపణలను రేఖా నాయక్ ఖండిస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని.. తన భర్త ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని రేఖ స్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి విచారణకైనా సిద్దమేనని ప్రకటించారు. 

రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్‌ కూడా.. ఈ కేసుతో అయ్యేది ఏం లేదని అంటున్నారు. తాను వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా వీఆర్ఎస్ తీసుకునేటప్పుడు ఏసీబీ క్లియరెన్స్ ఇచ్చిందని చెబుతున్నారు. ఆ కేసు కొట్టిపారేసిన తర్వాతనే వీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అమోదం ఇచ్చిందని అంటున్నారు. మరి రేఖా నాయక్ కేంద్రంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.