హైదరాబాద్: తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ మీద ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. రాజాసింగ్ హైదరాబాదులోని గోషా మహల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక బిజెపి ఎమ్మెల్యే ఆయన. 

పార్టీ రాష్ట్ర కమిటీలో తాను చెప్పినవారికి ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదని ఆయన బండి సంజయ్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ తెలంగాణలో బిజెపిని అభివృద్ధి చేస్తావా, గ్రూపిజం పెంచుతావా అని ఆయన సంజయ్ ను ప్రశ్నించారు. 

ఆ మేరకు ఆయన బండి సంజయ్ కు ఓ లేఖ రాశారు. ఆదివారంనాడు బండి సంజయ్ పార్టీ రాష్ట్ర కమిటిని ప్రకటించారు. అందులో గోషా మహల్ నియోజకవర్గం నుంచి ఒక్కరికి కూడా స్థానం కల్పించకపోడాన్ని ప్రస్తావిస్తూ రాజా సింగ్ ఆ లేఖ రాశారు. తెలం్గాణ రాష్ట్రంలోనే తాను ఏకైక బిజెపి ఎమ్మెల్యేనని, తనకు కనీసం బండి సంజయ్ గౌరవం ఇవ్వలేదని ఆయన అన్నారు. 

గోషామహల్ నియోజకవర్గం నుంచి తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కనీసం తాను సిఫారసు చేసిన ఏ ఒక్కరికైనా పార్టీలో పదవి ఇస్తే బాగుండేదని ఆయన అన్నారు. 

గ్రూప్ రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అభివృద్ధికి బండి సంజయ్ కృషి చేయాలని ఆయన సూచించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా అన్ని వర్గాలను కలుపుకుని పార్టీని బలోపేతం చేయాలని ఆయన అన్నారు.