Asianet News TeluguAsianet News Telugu

బీఏసీ సమావేశానికి పిలవలేదు.. సీఎం చెప్పినట్టుగానే స్పీకర్ నడుచుకుంటున్నారు: బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్

బీఏసీ సమావేశానికి తమ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు  బీఏసీ సమావేశానికి పిలిచారని.. ఇప్పుడు ముగ్గురు సభ్యులున్నప్పుడు ఎందుకు పిలవడంలేదని ప్రశ్నించారు.

MLA Raghunandan Rao says bjp Did not Get Call for Bac Meeting
Author
First Published Sep 6, 2022, 1:12 PM IST

బీఏసీ సమావేశానికి తమ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు  బీఏసీ సమావేశానికి పిలిచారని.. ఇప్పుడు ముగ్గురు సభ్యులున్నప్పుడు ఎందుకు పిలవడంలేదని ప్రశ్నించారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కో రోజు మాట్లాడి సమావేశాలను ముగించాలని అనకుంటున్నారని విమర్శించారు. సీఎం చెప్పినట్లుగా స్పీకర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు.

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగా నడిపిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ సభ సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. సీఎం చెప్పినట్టుగా వినకుండా సభ్యుల హక్కులను కాపాడాలని అన్నారు. బీఏసీ సమావేశానికి పిలవకపోవడం సభ సంప్రదాయాలను విస్మరించడమేనని చెప్పారు. 3 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహణ సరికాదని అన్నారు. బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుందని చెప్పారు. 

ఇక, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు ఉదయం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు నివాళులు అర్పించారు. తెలంగాణ బీజేపీ మరో ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోలీసులు ఇటీవల పీడీ యాక్ట్ నమోదు చేసిన సంగతి  తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. 

ఇక, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాసన సభ ప్రారంభమైన తర్వాత ముందుగా మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్ రెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ లో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో వారు చేసిన సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. ఎమ్మెల్యేలందరూ మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌‌‌‌ రెడ్డిల మృతి పట్ల సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం శాసనసభను స్పీకర్ పోచారం ఈ నెల 12వ తేదీకి వాయిదా చేశారు. మరోవైపు శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి.

శాసన సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్‌, మంత్రులతో పాటు ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ప్రభుత్వం మూడు రోజులు మాత్రమే సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం కనీసం 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే బీఏసీ సమావేశం‌లో మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు శాసనసభ వాయిదా పడటంతో.. 12,13 తేదీల్లో సమావేశాలు నిర్వహించనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios