తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరరేట్ విచారణకు దూరంగా ఉన్నారు.  రోహిత్ రెడ్డి తరపున ఆయన పీఏ శ్రవణ్ ఈడీ కార్యాలయానికి వచ్చారు.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరరేట్ విచారణకు దూరంగా ఉన్నారు. ఈడీ నుంచి నోటీసులు అందుకున్న రోహిత్ రెడ్డి ఈరోజు ఉదయం.. అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరుకాలేదు. రోహిత్ రెడ్డి తరపున ఆయన పీఏ శ్రవణ్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. విచారణకు మరికొంత సమయం కావాలని రోహిత్ రెడ్డి లేఖను ఆయన పీఏ ఈడీ అధికారులకు అందజేశారు. ఈడీ అధికారులు కోరిన సమాచారం ఇచ్చేందుకు మరింత సమయం కావాలని అన్నారు. అయితే రోహిత్ రెడ్డి లేఖపై ఈడీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. 

ఇక, ఇటీవల రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక పత్రాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 19లోగా సమర్పించాలని ఈడీ నోటీసులు జారీచేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద ఈ నోటీసులు జారీచేశారు. 

అయితే ఈరోజు ఉదయం 10.30 గంటల సమయంలో రోహిత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. యితే ఈరోజు ఉదయం తన ఇంటి నుంచి బయలుదేరిన రోహిత్ రెడ్డి.. ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ప్రగతి భవన్‌లో ఆయన కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇక, ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో రోహిత్ రెడ్డి ఫిర్యాదుదారునిగా ఉన్న సంగతి తెలిసిందే. 

అయితే ఈడీ నోటీసుల నేపథ్యంలో పైలెట్ రోహిత్ రెడ్డి న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నారు. అలాగే ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమై.. ఈడీ నోటీసులు, ప్రస్తుత పరిణామాలపై కూడా చర్చించారు. మరోవైపు ఈడీ నోటీసులపై స్పందించిన పైలెట్ రోహిత్ రెడ్డి.. తనకు ఏ కేసులో నోటీసులు ఇచ్చారనేది అధికారులు స్పష్టం చేయలేదని చెప్పారు. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఫిర్యాదుదారునిగా ఉన్నందుకే బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. 

‘‘డిసెంబర్ 19న హాజరు కావాలని నాకు సమన్లు అందాయి. నా ఐడెండిటీ ప్రూఫ్స్, ఐటీ రిటర్న్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, కుటుంబ వ్యాపార వివరాలు, ఆదాయ వనరులు, కుటుంబ సభ్యుల ఆదాయాన్ని సమర్పించాల్సిందిగా ఈడీ నన్ను కోరింది. నేను నా న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాను. నా కుటుంబ సభ్యులకు గానీ, నాకు గానీ గుట్కా వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులపై ఎటువంటి కేసు లేదు. కుటుంబ సభ్యులలో ఎవరికీ ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. 2015 నుంచి నా చర, స్థిరాస్తులు, బ్యాంకు రుణాల వివరాలను సమర్పించాల్సిందిగా ఈడీ నన్ను కోరింది. బెంగళూరు డ్రగ్స్ కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కర్ణాటక పోలీసులు నన్ను ఎప్పుడూ పిలవలేదు. ఇది మొట్టమొదటి సమన్లు, వారు నన్ను ఏ కేసు కోసం పిలుస్తున్నారో వారు ప్రస్తావించలేదు’’ అని రోహిత్ రెడ్డి శుక్రవారం తెలిపారు.