గద్వాల : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరో జాక్ పాట్ కొట్టేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణను ఓడించి రికార్డు సృష్టించి నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ జెండా పాతారు. 

తాజాగా తన భార్యను ఏకగ్రీవర్ సర్పంచ్ చేసి బురెడ్డిపల్లి పంచాయితీని తన ఖాతాలో వేసుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చెయ్యకుండానే కృష్ణమోహన్ రెడ్డి జాక్ పాట్ కొట్టేశారని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. పంచాయితీ ఎన్నికల్లో బురెడ్డి పల్లి పంచాయితీ నుంచి ఎమ్మెల్యే సతీమణి జ్యోతి నామినేషన్ వేశారు. 

ఆమెతోపాటు ఎమ్మెల్యే బంధువర్గం నుంచి ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఎన్నిక ఏకగ్రీవం చేయాలని పోటీదారులకు ఎమ్మెల్యే సూచించారు. అయినా ఆరుగురు నామినేషన్లు వెయ్యడంతో ఎమ్మెల్యే సతీమణితో వేయించారు. 

ఎమ్మెల్యే సతీమణి నేరుగా బరిలోకి దిగడంతో వారంతా నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్యే సతీమణి సర్పంచ్‌గా ఉంటే నిధులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని పోటీలో ఉన్నవారు చెప్పుకొచ్చారు.