తెలంగాణ సర్కారు పై డికె అరుణ ఫైర్ సమంతను ఎందుకు బ్రాండ్ అంబాసిడ్ గా పెట్టుకున్నారని ప్రశ్న ప్రాజెక్టుల నిర్వాసితులకు వివక్ష చూపుతున్నారు గద్వాల చేనేతపై చిన్నచూపు నిధులన్నీ సిరిసిల్లకే తరలింపు పోలీసు శాఖలోనే జాబ్స్ ఎందుకు నింపుతున్నారు?

సినీతార సమంతపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ పంచ్ వేశారు. సమంత ప్రస్తతానికి సినిమాలు చేస్తూనే తెలంగాణ ప్రభుత్వానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నది. దీంతో ఆమెను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు పెట్టుకున్నారన్న విమర్శలు తెలంగాణ సర్కారుపై పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డికె అరుణ కూడా చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంతపై కామెంట్ చేశారు. ఏ జిల్లా ఏ రాష్ట్రానికి చెందినదో కూడా తెలియని సమంతను బాండ్ అంబాసిడర్ గా నియమించడం విడ్డూరంగా ఉందని డికె అరుణ విమర్శించారు.

ఇక జీఎస్టీపై ముఖ్యమంత్రి ద్వంధవైఖరీ అవలంబిస్తున్నారని అరుణ ఆరోపించారు. ప్రతీసారి మాటమార్చడంలో ఆంతార్యమేమిటి, మర్మమేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భూసేకరణ విషయంలో పక్షపాత వైఖరిని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి భూ నిర్వాసితులకు కేవలం ఐదారు లక్షలు.. మల్లన్న సాగర్ నిర్వాసితులకు 15 లక్షలకు పైగా భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

కాంగ్రేస్ పార్టీ కోర్టులకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకుంటుందని సీఎం కేసిఆర్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. మీ పాలన తీరుపైనే కేసులు వేస్తున్నారే తప్పా మరేది కాదని చెప్పారు. సిరిసిల్లలో పవర్ లూం కార్మికులు పనిచేస్తుండగా, గద్వాలలో చేనేత కార్మికులున్నారని తెలిపారు. 90 శాతం నిదులు సిరిసిల్లకు, 10 శాతం గద్వాల జిల్లాకు మంత్రి కెటిఆర్ కేటాయిస్తూ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చేందుకు సిరిసిల్ల పవర్ లూం పై నేచిన చీరలను... హాండ్లూం చీరలుగా చిత్రికరిస్తున్నారని తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్న భాష రోజురోజుకు దిగజారిపోతుందన్నారు. వీరి భాష తెలంగాణ భాషను దిగజార్చే విధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రతిపక్షాలను తిట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలోఅన్ని రకాల ఉద్యోగాలను భర్తి చేయడం పక్కనబెట్టి ఒక్క పోలీస్ శాఖపైనే దృష్టిపెడ్డంలో ఆంతర్యమేంటి అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై తిరగబడే ప్రజలపై పోలీసులతో కొట్టించి అణిచి వేసేందుకే పోలీసు శాఖలో ఖాళీలను భర్తి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ఎదురు తిరిగిన ప్రజలను అనచి వేయడం సిరిసిళ్ల జిల్లా నేరెళ్ల ఘటన ఓ ఉదాహరణ అని అరుణ అన్నారు.