పెద్ద పల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధిక, ఆమె భర్త , కుమార్తె సోమవారం ఉదయం శవాలై కనిపించారు. కరీంనగర్ లో ని కాకతీయ కెనాల్ వద్ద సోమవారం ఉదయం ఓ కారు కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే.  తొలుత గుర్తు తెలియని వ్యక్తులు అని భావించిన పోలీసులు ... కారు నెంబర్ ఆధారంగా ఎమ్మెల్యే కుటుంబసభ్యులుగా గుర్తించారు.

దీంతో... ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే సోదరి కుటుంబం చనిపోయిందన్న విషయం కన్నా.. కూడా వీరి మృతిపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్యే చెల్లెలు రాధిక, బావ సత్యానారాయణ రెడ్డి, వారి కుమార్తె సహస్ర.. గత 20 రోజులుగా కనిపించకపోవడం గమనార్హం. కుటుంబంలోని సభ్యులు 20 రోజులుగా కనిపించకపోయినా... వారి ఫోన్లు కలవకపోయినా.. కనీసం పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదు అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఫ్యామిలీలో ఒక్కరు కాకుండా.. మొత్తంగా కుటుంబమే కనిపించకపోయినా.. ఒక్క ఫోన్ కూడా చేయకపోయినా.. ఎందుకు అనుమానం రాలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇది ప్రమాదమా? లేక కుట్ర కోణమా? అనేది మిస్టరీగా మారింది. కారు కొట్టుకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవేళ కారు కొట్టుకురాకపోయి ఉంటే.... అసలు పట్టించుకోకుండా వదిలేసేవారా అని పలువురు  చర్చించుకుంటున్నారు. వీరి మృతి వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉండొచ్చనే అనుమానం అందరిలోనూ కలుగుతుండటం గమనార్హం. 

Also Read కాకతీయ కెనాల్ లో కారు... కుళ్లిన స్థితిలో ఎమ్మెల్యే సోదరి, ఆమె భర్త, కూతురు...

కాగా... తన సోదరి, ఆమె భర్త, కూతురు మృతిపై పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పందించారు. జనవరి 27న సాయంత్రం కరీంనగర్ నుంచి తన సోదరి, బావ వారి కూతురు కారులో బయటకు వెళ్లారని చెప్పారు. అప్పటి నుంచి వారి ఫోన్ కలవలేదన్నారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేసినా సమాచారం దొరకలేదన్నారు. వారంతా క్షేమంగా ఉన్నారని అనుకున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఇంతలో ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందన్నారు. తన సోదరి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు.

వారి కుటుంబంలో ఎలాంటి గొడవలు కూడా లేవన్నారు. అసలేం జరిగిందో తనకూ తెలియదన్నారు. తన సోదరి కుటుంబం తరుచూ విహార యాత్రలకు వెళ్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. తన సోదరి కొడుకు మూడేళ్ల క్రితం కారు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్యే తెలిపారు. చెల్లెలు, బావ వారి కూతురు మృతితో ఎమ్మెల్యే దాసరి మనోహర్ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి.