తాండూరు: ఇటీవల అదృశ్యమైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత నాగరాజు గౌడ్ గొల్ల చెరువులో శుక్రవారం శవమైన కనిపించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు కొడంగల్ నియోజకవర్గంలోని అంగడి రాయచూర్ గ్రామానికి చెందిన నాగరాజ్ గౌడ్ 20 ఏళ్ల క్రితం తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి వచ్చాడు. గ్రామంలో వ్యవసాయ భూమి కొని, అక్కడే కుటుంబంతో స్థిరపడ్డాడు. 

అయినా కూడా నాగరాజు గౌడ్ కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చాడు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డాడు. అప్పటి నుంచి వ్యాపారాలు చూసుకుంటున్నాడు. 

భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉండగానే నాగరాజు గౌడ్ మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యను షాద్ నగర్ లో ఉంచి కాపురం పెట్టాడు. రెండో భార్యకు ఓ కూతురు ఉంది. రెండో భార్యను వ్యాపారాల పేరుతో తరుచుగా పూణేకు తీసుకుని వెళ్తుండేవాడు. 

ఆ క్రమంలో మొదటి భార్య లక్ష్మి వద్దకు రావడం తగ్గించాడు. దాంతో వీరి మధ్య తరుచుగా గొడవ పడుతుండేవారు. వారి గొడవలు చాలా సార్లు పోలీసు స్టేషన్ దాకా కూడా వెళ్లాయి. ఈ నెల 12వ తేదీన నాగరాజు మొదటి భార్య వద్దకు వచ్చాడు. అదే రోజు భార్యాపిల్లలతో గొడవ జరిగినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత శుక్రవారం తాండూరు పట్టణానికి సమీపంలో ఉన్న గొల్ల చెరువులో నాగరాజు గౌడ్ శవం కనిపించింది.

తన తండ్రి కనిపించడం లేదంటూ ఈ నెల 12వ తేదీన నాగరాజు కూతురు ప్రియా కరన్ కోట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తండ్రి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లు కూడా పనిచేయడం లేనది చెప్పింది. దాంతో తాండూరు రూరల్ ఇన్ స్పెక్టర్ కేసు విచారణ చేపట్టారు. చెంగోల్ గ్రామానికి వెళ్లి అనుమానితుల వివరాలు సేకరించారు. 

చెంగోల్ గ్రామంలో ఉంటున్న నాగరాజు గౌడ్ మొదటి భార్య లక్ష్మిని, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నాగరాజు గౌడ్ ను హత్య చేసి గొల్ల చెరువులో శవాన్ని పడేసినట్లు అంగీకరించారని అంటున్నారు. నాగరాజ్ గౌడ్ శవాన్ని వెలికి తీయించి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. హత్యలో ఐదుగురి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.