ఇది కేసిఆర్ నాటిన శిలాఫలకం. దీనికి ఏ గతి పట్టిందో ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. ఇదేదో దశాబ్దాల తరబడి ఉన్నది కాదు. జస్ట్ నెల రోజులు కూడా కాలేదు. ఫౌండేషన్ స్టోన్ వేశారు. దాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బద్ధలు చేశారు.

యాదవుల కోసం యాదవ భవన్ నిర్మిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించింది తెలంగాణ సర్కారు. ప్రకటించిందే తడువుగా అంగరంగ వైభవంగా యాదవ భవన్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రాజేంద్ర నగర్ లో దీనికోసం భూమిని కేటాయించింది.

ఇందులో యాదవులకు అద్భుతమైన భవనాలు నిర్మిస్తామని కేసిఆర్ ప్రకటించారు. తెలంగాణలో ఉన్న యాదవ ప్రముఖులందరినీ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యాదవులకు ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సీటును ఈ శంకుస్థాపన వేదిక మీదినుంచే ప్రకటించారు కేసిఆర్.

సీన్ కట్ చేస్తే యాదవ భవన్ శిలాఫలకం ముక్కలు ముక్కలై పడి ఉంది. దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. భవనం నిర్మాణ పనులు కూడా మొదలుకాలేదు. ఆ శిలాఫలకాన్ని ఎవరు బద్దలు చేశారన్నది తేలాల్సి ఉంది.

శిలాఫలకం ధ్వంసం అయిన ఘటనపై యాదవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.